Deepika Padukone: రూ. 25 కోట్లు డిమాండ్ చేసిన దీపిక పదుకొణె.. తప్పేముందున్న బాలీవుడ్ డైరెక్టర్

Deepika Padukone Demanded 25 Crores Says Bollywood Director Kabir Khan
  • దీపికా పదుకొణె డిమాండ్లపై స్పందించిన దర్శకుడు కబీర్ ఖాన్
  • పనివేళల విషయంలో దీపిక డిమాండ్ న్యాయమైనదేనని వెల్లడి
  • ఆమిర్‌ఖాన్, అక్షయ్‌కుమార్ కూడా 8 గంటల షిఫ్ట్‌లోనే పనిచేస్తారని గుర్తుచేసిన కబీర్
  • స్టార్‌డమ్‌ను బట్టే పారితోషికం ఉంటుందన్న దర్శకుడు
బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొణె ఓ భారీ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగడానికి ఆమె డిమాండ్లే కారణమని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. నిర్దిష్ట పనిగంటలతో పాటు, రూ.25 కోట్ల భారీ పారితోషికం అడగటం వల్లే ఆమెను ప్రాజెక్ట్ నుంచి తొలగించారని ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలపై ‘భజరంగీ భాయీజాన్‌’, ‘చందూ ఛాంపియన్‌’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు కబీర్‌ ఖాన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పనివేళల విషయంలో దీపికా పదుకొణె చేసిన డిమాండ్‌ను కబీర్ ఖాన్ సమర్థించారు. "నేను దాదాపు 500 మంది సిబ్బందితో కలిసి పనిచేస్తుంటాను. సినిమా రంగంలో పనిచేసే వారికి కూడా సొంత జీవితాలు ఉంటాయి, వారి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. బాలీవుడ్ స్టార్ హీరోలైన ఆమిర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌లు కూడా రోజుకు 8 గంటల షిఫ్ట్‌లో మాత్రమే పనిచేస్తారు. అలాంటప్పుడు, దీపికా విషయంలో ఇదే అంశాన్ని ఎందుకు తప్పుగా పరిగణిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ దీన్ని నిరాకరించాలనుకుంటే, దర్శకులకు అందుకు బలమైన కారణం ఉండాలి. సినిమా షూటింగ్‌ల కోసం నటీనటులు వారి వ్యక్తిగత జీవితాలను త్యాగం చేయాలనే వాదనను నేను అంగీకరించను. నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ 12 గంటలకు మించి షూటింగ్‌ చేయలేదు. అలాగే ఆదివారాల్లో కూడా చిత్రీకరణలు పెట్టను" అని ఆయన స్పష్టంగా వివరించారు.

ఇక దీపికా పదుకొణె రూ.25 కోట్లు పారితోషికం డిమాండ్‌ చేశారన్న వార్తలపై కూడా కబీర్‌ ఖాన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రేక్షకాదరణ పొందిన ఏ నటీనటులైనా తమ స్థాయికి తగిన పారితోషికం అడగడంలో తప్పులేదని అన్నారు. వ్యక్తులను చూసి కాకుండా, వారికున్న స్టార్‌డమ్‌ ఆధారంగా రెమ్యూనరేషన్‌ నిర్ణయించాలని ఆయన సూచించారు.

ప్రస్తుతం కబీర్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. దీపికా పదుకొణె ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివాదంపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోయినప్పటికీ, పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు వివిధ వేదికలపైనా, ఇంటర్వ్యూలలోనూ ఈ విషయంపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
Deepika Padukone
Deepika Padukone remuneration
Kabir Khan
Bollywood actress
Bollywood director
Movie shooting hours
Remuneration demands
Aamir Khan
Akshay Kumar
Chandu Champion

More Telugu News