Kommineni Srinivasa Rao: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Kommineni Srinivasa Rao Gets Relief in Supreme Court
  • కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
  • విడుదలకు సంబంధించిన నిబంధనలను ట్రయల్ కోర్టు పర్యవేక్షిస్తుందన్న ధర్మాసనం
  • భవిష్యత్తులో మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కొమ్మినేనికి హెచ్చరిక
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సాక్షి ఛానల్‌లో అమరావతి మహిళలను కించపరిచేలా చర్చా కార్యక్రమం నిర్వహించి, అనుచిత ప్రశ్నలు వేశారన్న ఆరోపణలపై అరెస్టయిన ఆయనను తక్షణమే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం చేయవద్దని ధర్మాసనం ఆయనను గట్టిగా హెచ్చరించింది.

తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. కొమ్మినేనిని విడుదల చేయాలని ఆదేశిస్తూ, బెయిల్ మంజూరు చేసింది. కొమ్మినేని విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు, ప్రక్రియలను సంబంధిత ట్రయల్ కోర్టు చూసుకుంటుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా కొమ్మినేని తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తూ... సాక్షి ఛానల్ లో చర్చ సందర్భంగా కొమ్మినేని మహిళల పట్ల ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని... చర్చలో పాల్గొన్న ఒక ప్యానలిస్ట్ ఆ వ్యాఖ్యలు చేశారని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు స్పందిస్తూ... పిటిషనర్ చేయని వ్యాఖ్యలకు ఆయనను ఎలా అరెస్ట్ చేస్తారని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గిని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా రోహత్గి స్పందిస్తూ... ప్యానలిస్ట్ అనుచిత వ్యాఖ్యలు చేస్తుండగా ఆయనను ప్రోత్సహించేలా కొమ్మినేని వ్యవహరించారని... గట్టిగా నవ్వుతూ ఉన్నారని చెప్పారు. 

ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం... కొమ్మినేనికి అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇతరులు చేసిన తప్పుకు ఆయనను అరెస్ట్ చేయడం సరికాదని స్పష్టం చేసింది.


Kommineni Srinivasa Rao
Kommineni
Senior Journalist
Supreme Court
Sakshi Channel
Amaravati
Arrest
Defamation Case
Journalist Arrest

More Telugu News