Sumit Sabharwal: తండ్రికి ఇచ్చిన మాట నిలుపుకోకుండానే ఎయిరిండియా పైలెట్ విషాదాంతం

Sumit Sabharwal Air India Pilot Dies in Ahmedabad Plane Crash
  • అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలి ఘోర దుర్ఘటన
  • టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే చెట్టును ఢీకొట్టి కుప్పకూలిన విమానం
  • ప్రమాదంలో మొత్తం 297 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక ప్రకటన
  • విమానంలోని 241 మంది ప్రయాణికులు, సిబ్బంది సజీవ దహనం
  • తండ్రిని చూసుకుంటానని మాట ఇచ్చిన పైలట్ సుమీత్ కూడా మృతి
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని విషాదానికి గురిచేసింది. ఈ ఘోర దుర్ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో పాటు కింద ఉన్న కొందరు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 297కి చేరినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ దుర్ఘటనలో మరణించిన విమాన కెప్టెన్ సుమీత్ సభర్వాల్‌ (ముంబైలోని పొవై నివాసి) వ్యక్తిగత జీవితంలోని ఓ విషాద కోణం అందరినీ కదిలిస్తోంది. సుమీత్‌కు పైలట్‌గా 8,200 గంటల అపార అనుభవం ఉంది. 1994 నుంచి పైలట్‌గా సేవలందిస్తున్న ఆయన, తన వృత్తికే జీవితాన్ని అంకితం చేశారు. వివాహం కూడా చేసుకోకుండా, వయసు పైబడి అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి బాగోగులు చూసుకుంటున్నారు. 

కొద్దికాలం క్రితమే, "నాన్నా, పైలట్ ఉద్యోగం మానేసి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను" అని తన తండ్రికి సుమీత్ మాట ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు. కానీ, ఆ మాట నిలబెట్టుకోకుండానే, తండ్రి కన్నా ముందే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కొడుకు మరణంతో ఆ వృద్ధ తండ్రి ఇప్పుడు ఒంటరివాడయ్యారంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. 

ఈ ఘటనతో అహ్మదాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విదేశాల్లో స్థిరపడాలని కలలుగన్నవారు, పర్యాటకులు, విద్యార్థులు ఇలా ఎందరో ఈ ప్రమాదంలో అసువులు బాశారు. వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Sumit Sabharwal
Air India crash
Ahmedabad
pilot death
flight accident
Gujarat
Air India
Mumbai
Powai
Indian aviation

More Telugu News