Jagan Mohan Reddy: కొమ్మినేనికి సుప్రీంలో ఊరట లభించడంపై జగన్ స్పందన

Jagan Mohan Reddy Reacts to Supreme Court Relief for Kommineni
  • అమరావతి మహిళలపై వ్యాఖ్యల కేసులో కొమ్మినేనికి సుప్రీంకోర్టులో ఊరట
  • సీనియర్ జర్నలిస్టును వెంటనే విడుదల చేయాలన్న సుప్రీం ఆదేశాలు
  • ఇది చంద్రబాబు నిరంకుశత్వానికి చెంపపెట్టు అన్న వైఎస్ జగన్
  • ప్రజల దృష్టి మరల్చేందుకే చంద్రబాబు కృత్రిమ వివాదం సృష్టించారని ఆరోపణ
  • కొమ్మినేనికి సంబంధం లేని వ్యాఖ్యలు ఆపాదించారని జగన్ విమర్శ
  • సుప్రీం తీర్పుతో చంద్రబాబు కుట్ర బట్టబయలైందని వ్యాఖ్య
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ పాత్రికేయుడు, సాక్షి చానల్ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. "సత్యమేవ జయతే" అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

"సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు గారికి పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు న్యాయస్థానం గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహం. 

అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబుగారు  కృత్రిమ వివాదాన్ని సృష్టించారు. అబద్ధాలు, మోసాలతో కూడిన పాలననుంచి మళ్లించడానికి, తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేని గారికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్‌ద్వారా పథకం ప్రకారం విషప్రచారం చేయించారు. వాటిని పట్టుకుని  రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్‌ ఆఫీసులమీద, కార్యాలయాలమీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛ‌ను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు. 

చంద్రబాబుగారు తన తప్పును తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైసీపీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా మాట్లాడ్డంతోనే ఆయన రాజకీయ లబ్ధికోసం ఈ కుట్రపన్నారని అర్థం అవుతోంది. యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేని గారికి విశ్లేషకుడి వ్యాఖ్యలతో ఏం సంబంధం అంటూ? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావు.... సత్యమేవ జయతే" అంటూ జగన్ పేర్కొన్నారు.

Jagan Mohan Reddy
Kommineni Srinivasa Rao
Sakshi TV
Chandrababu Naidu
Amaravati
Supreme Court
Defamation Case
Freedom of Press
YS Jagan
Andhra Pradesh Politics

More Telugu News