Raja Raghuvanshi: హనీమూన్ హత్య: రాజా రఘువంశీ హత్యకు మూడుసార్లు విఫలమై, నాలుగోసారి చంపేశారు!

Raja Raghuvanshi Honeymoon Murder Four Attempts Revealed
  • హనీమూన్‌లో భర్త రాజా రఘువంశీ దారుణ హత్య
  • భార్య సోనమ్, ఆమె ప్రియుడు, కిరాయి హంతకుల పనేనని నిర్ధారణ
  • హత్యకు ముందు మూడుసార్లు విఫలయత్నం చేసిన హంతకులు
  • నాలుగో ప్రయత్నంలో వెయిసావ్‌డోంగ్‌ జలపాతం వద్ద ఘాతుకం
  • పోలీసుల విచారణలో వెలుగు చూసిన విస్తుపోయే వాస్తవాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ హత్య కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగుచూస్తోంది. తాజాగా, నిందితురాలు సోనమ్, ఆమె నియమించుకున్న హంతకులు భర్త రాజా రఘువంశీని అంతమొందించేందుకు మూడుసార్లు విఫలయత్నం చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దారుణమైన వివరాలను ఎస్పీ వివేక్ సియామ్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. నాలుగో ప్రయత్నంలో హంతకులు తమ ప్లాన్‌ను విజయవంతంగా అమలుచేసి రాజా రఘువంశీని దారుణంగా హత్య చేశారని ఆయన తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హంతకులు రాజా రఘువంశీని హత్య చేయడానికి అనేక ప్రణాళికలు రచించారు. తొలిసారిగా గువాహటిలో హత్య చేసి, మృతదేహాన్ని ఎక్కడైనా పడేయాలని పథకం వేశారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ప్లాన్ వాయిదా పడింది. ఆ తర్వాత మేఘాలయలోని సోహ్రా ప్రాంతంలో రెండుసార్లు హత్యకు ప్రయత్నించినా అవి కూడా విఫలమయ్యాయి.

మొదట నంగ్రిట్ వద్ద హత్య చేసి, మృతదేహాన్ని పారవేసేందుకు అనువైన ప్రదేశం దొరకకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అనంతరం మవ్లాఖియట్, వెయిసావ్‌డోంగ్‌ వద్ద కూడా ప్రయత్నించారు. రఘువంశీ వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు హత్య చేయాలనుకున్నా అది కూడా సాధ్యపడలేదు. చివరకు, వెయిసావ్‌డోంగ్‌ జలపాతం వద్ద రఘువంశీపై దాడి చేసి కిరాతకంగా హత్య చేశారని ఎస్పీ వివరించారు.

సోనమ్, రఘువంశీల వివాహం మే 11న జరిగింది. వివాహం అనంతరం ఈ జంట గువాహటిలోని కామాఖ్య అమ్మవారి ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లారు. అయితే, హంతకులు మే 19వ తేదీనే గువాహటి చేరుకుని సిద్ధంగా ఉన్నారు. అక్కడినుంచి సోనమ్ షిల్లాంగ్, సోహ్రా వెళ్లాలని నిర్ణయించుకోవడంతో, హంతకులు గువహటిలో తమ ప్రణాళికను రద్దు చేసుకుని, ఆమెను అనుసరించినట్లు ఎస్పీ తెలిపారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రాజా రఘువంశీ కుటుంబం ట్రాన్స్‌పోర్టు వ్యాపారం నిర్వహిస్తోంది. మే 20న నవ దంపతులు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వారు కనిపించకుండా పోయారు. రఘువంశీ అదృశ్యమైన 11 రోజుల తర్వాత, సోహ్రాలోని జలపాతం సమీపంలో ఒక లోతైన లోయలో ఆయన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆయన శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో పోలీసులు దీనిని హత్యగా నిర్ధారించారు.
Raja Raghuvanshi
Honeymoon murder case
Meghalaya murder
Sonam
Guwahati murder plot
Sohra
Indore
Crime news

More Telugu News