Air India: విమాన ప్రమాదం: బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

Air India Plane Crash Black Box Recovered
  • అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానానికి ఘోర ప్రమాదం
  • టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిన డ్రీమ్‌లైనర్ విమానం
  • ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు మృతి, ఒకరు సేఫ్
  • ఘటనా స్థలంలో కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యం
  • బ్లాక్ బాక్స్‌ డేటాను విశ్లేషిస్తే ప్రమాద కారణాలు తెలిసే అవకాశం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిన్న ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇప్పుడా విమానం బ్లాక్ బాక్స్ లభ్యమైంది. దాంతో, ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటన్నది తెలిసే అవకాశం ఉంది. 

అహ్మదాబాద్  నుంచి లండన్ బయల్దేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, అద్భుతరీతిలో ఒక ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద స్థలం నుంచి విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఇద్దరు పోలీసు అధికారులు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.

ప్రమాదానికి ముందు పైలట్లు "మేడే" కాల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే విమానం కూలిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏమిటనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో లభ్యమైన బ్లాక్ బాక్స్ ద్వారా ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగిందనే విషయాలు, పైలట్ల చివరి మాటలు, సాంకేతిక లోపాలు వంటి కీలక సమాచారం తెలిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ తర్వాతే ప్రమాదానికి కచ్చితమైన కారణాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. 
Air India
Air India crash
Ahmedabad
Dreamliner
Plane crash
Black box
Gujarat
London flight
Flight accident
Aviation accident

More Telugu News