Ahmedabad Air India plane crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం: 1000 డిగ్రీల వేడితో మంటలు

Ahmedabad Air India plane crash 1000 degree fire
  • అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఎయిరిండియా విమానం, భారీ అగ్నిప్రమాదం
  • ప్రమాద స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్‌కు చేరిన ఉష్ణోగ్రతలు
  • విమానంలో లక్షా 25 వేల లీటర్ల ఇంధనం, వేగంగా వ్యాపించిన మంటలు
  • సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం, ఎవరినీ కాపాడలేని పరిస్థితి
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో గురువారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన తీరు, అనంతర పరిణామాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం కూలిపోయిన ప్రదేశంలో దాదాపు 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు ఎగిసిపడ్డాయని, సహాయక చర్యలు చేపట్టడం అత్యంత క్లిష్టతరంగా మారిందని అధికారులు తెలిపారు.

ఈ విమానంలో సుమారు 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందని, అది పేలి మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఎవరినీ రక్షించే అవకాశం లేకుండా పోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదివరకే వెల్లడించారు. ఘటనపై ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారి ఒకరు మాట్లాడుతూ, "ప్రమాద సమాచారం అందిన వెంటనే మధ్యాహ్నం 2 నుంచి 2:30 గంటల సమయంలో మా బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అప్పటికే స్థానికులు కొందరు హాస్టల్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడారు. అయితే, మంటలు తీవ్రంగా వ్యాపించడంతో పరిస్థితి అదుపు తప్పింది" అని వివరించారు.

మరో అధికారి ప్రమాద స్థలంలోని భయానక వాతావరణాన్ని వివరిస్తూ, "మేము గతంలో అనేక సహాయక చర్యల్లో పాల్గొన్నాం, కానీ ఇంతటి విపత్తును ఎప్పుడూ చూడలేదు. విమాన ఇంధన ట్యాంక్ పేలిపోవడంతో పెద్ద అగ్నిగోళంలా మారింది. క్షణాల్లోనే అక్కడి ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. దీంతో ఎవరూ బయటపడే మార్గం లేకుండా పోయింది. మేము పీపీఈ కిట్లు ధరించి ఘటనా స్థలానికి వెళ్లినా, వేడి తీవ్రత అధికంగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఆ ప్రాంతంలోని పక్షులు, కుక్కలు కూడా తప్పించుకోలేనంత వేగంగా ఉష్ణోగ్రత పెరిగింది. ప్రమాద స్థలంలో అనేక పక్షులు, శునకాలు కాలి బూడిదయ్యాయి. ఎటు చూసినా శిథిలాలే కనిపించాయి. వాటి కింద తీవ్రంగా కాలిపోయిన ప్రయాణికుల మృతదేహాలను గుర్తించడం సవాలుగా మారింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
Ahmedabad Air India plane crash
Air India
Ahmedabad
Gujarat
Plane crash
Amit Shah

More Telugu News