Harish Rao: కేటీఆర్‌కు నోటీసులు, అందాల పోటీలపై స్పందించిన హరీశ్ రావు

Harish Rao Reacts to KTR Notices and Beauty Pageant Controversy
  • ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని తీవ్ర ఆరోపణ
  • ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ చర్యలని విమర్శ
  • దర్యాప్తు సంస్థలను సీఎం రేవంత్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్య
  • కాంగ్రెస్ హామీల అమలుపై కేటీఆర్ ప్రశ్నిస్తున్నందుకే కక్ష సాధిస్తున్నారని ఆరోపణ
  • ఫార్ములా-ఈ తో రాష్ట్ర ప్రతిష్ఠ పెరిగిందని వెల్లడి
  • కాంగ్రెస్ అందాల పోటీలతో పరువు తీసిందని వ్యాఖ్య
ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, కేటీఆర్‌కు ఇచ్చిన తాజా నోటీసులే ఇందుకు నిదర్శనమని శుక్రవారం సామాజిక మాధ్యమం వేదికగా హరీశ్ రావు విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలు గురించి కేటీఆర్ నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, ఆయన నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి ఈ నోటీసులు పంపించారని హరీశ్ రావు ఆరోపించారు.

"రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18 నెలల పాలనలో డైవర్షన్ పాలిటిక్స్‌ను అమలు చేస్తూ బీఆర్ఎస్‌ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రాజకీయ అరాచకత్వం గెలిచే ప్రసక్తే లేదు. రేవంత్ రెడ్డి డ్రామా, డైవర్షన్ రాజకీయాలు ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యాయి" అని తన పోస్టులో పేర్కొన్నారు.

ఫార్ములా-ఈ రేసింగ్‌తో తెలంగాణ ప్రతిష్ఠ పెరిగిందని, పెట్టుబడులు కూడా వచ్చాయని హరీశ్ రావు గుర్తుచేశారు. ఇది రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు. "2000లో చంద్రబాబు ఫార్ములా వన్ కోసం కృషిచేసి నిర్వహించలేకపోయాడు. అలాంటిది కేటీఆర్ కృషి చేసి ఫార్ములా వన్ వంటి ప్రతిష్ఠాత్మక రేస్‌ను భారతదేశానికి, అందులోనూ హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల  మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తెలంగాణను మార్చేందుకు ఫార్ములా ఈ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించారు. అమర్ రాజా వంటి కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి" అని హరీశ్ రావు వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించి రాష్ట్ర పరువును, దేశ పరువును మంటగలిపిందని హరీశ్ రావు విమర్శించారు. "అందాల పోటీతో లాభం లేదు కానీ రాష్ట్ర పరువు మాత్రం తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నందుకు కేటీఆర్‌కి ఏసీబీ నోటీసులు ఇచ్చారని స్పష్టమవుతున్నది. రేవంత్ రెడ్డీ.. నువ్వు ఎన్ని రకాలుగా వేధించినా నీ వైఫల్యాలను ఎండగట్టడం మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆపదు" అని హెచ్చరించారు.
Harish Rao
KTR
Revanth Reddy
BRS
Formula E Racing
Telangana
ACB Notices

More Telugu News