Zomato: వర్షం లేకపోయినా ఫీజు... జొమాటోపై బెంగళూరు వాసి ఆగ్రహం

Zomato Customer Outraged by Rain Fee Without Rain in Bengaluru
  • బెంగళూరులో చినుకు పడకున్నా జొమాటో 'రెయిన్ సర్జ్' బాదుడు
  • ఎక్స్ వేదికగా యూజర్ తీవ్ర ఆగ్రహం, ఆధారాలతో పోస్ట్
  • గంటల తరబడి సర్జ్ ఫీజు వసూలు చేస్తున్నారని కస్టమర్ ఆరోపణ
  • వెదర్ ఏపీఐ లోపంపై దృష్టి పెట్టాలని జొమాటోకు యూజర్ సూచన
  • జొమాటో గోల్డ్ సభ్యులకూ వర్షపు సర్జ్ ఫీజు మినహాయింపు రద్దు
ఇటీవలి కాలంలో ఫుడ్ యాప్‌లు, కిరాణా డెలివరీ యాప్‌లు ప్లాట్‌ఫాం ఫీజులు, లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజులు వంటి అదనపు ఛార్జీలు వేస్తున్నాయని తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నాయి. తాజాగా, ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మరోసారి వార్తల్లో నిలిచింది. బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్, అసలు వర్షం కురవకపోయినా తమకు 'రెయిన్ సర్జ్ ఫీజు' విధించారని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఈ ఘటన ఫుడ్ డెలివరీ యాప్‌ల సర్జ్ ధరల విధానంపై మరోసారి చర్చకు దారితీసింది.

వివరాల్లోకి వెళితే... ప్రఖ్యాత్ రాయ్ అనే బెంగళూరు వాసి, జూన్ 10న తన ఎక్స్ ఖాతాలో జొమాటో తీరును తప్పుపట్టారు. "బెంగళూరులో చినుకు కూడా పడటం లేదు, కానీ గత నాలుగు గంటలుగా జొమాటో 'రెయిన్ సర్జ్ ఫీజు' చూపిస్తోంది. ఇక రాత్రి 1 గంటకు ట్రాఫిక్ సర్జ్ కూడా పెడతారేమో.. హాస్యాస్పదంగా ఉంది" అంటూ @zomato, @zomatocareలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఆయన చేసిన పోస్ట్ కొద్దిసేపట్లోనే వైరల్ అయింది. అనేక మంది యూజర్లు తాము కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నామని కామెంట్లు చేశారు.

ఈ ఫిర్యాదుపై జొమాటో అధికారిక సహాయ విభాగం జొమాటో కేర్ స్పందించింది. "హాయ్ ప్రఖ్యాత్, దీనిపై మేము తనిఖీ చేయాలనుకుంటున్నాము. దయచేసి మీ రిజిస్టర్డ్ కాంటాక్ట్ వివరాలు లేదా ఆర్డర్ వివరాలను డీఎం ద్వారా పంచుకోండి... మేం పరిశీలిస్తాం" అని బదులిచ్చింది.

అయితే, ప్రఖ్యాత్ రాయ్ అంతటితో ఆగకుండా, జూన్ 12న మరో పోస్టులో ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని సూచనలు కూడా చేశారు. "మీ సర్జ్ లాజిక్‌ను ఆడిట్ చేయండి. ముఖ్యంగా వాతావరణ ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్)పై ఆధారపడటాన్ని సమీక్షించండి. ప్రత్యామ్నాయ ధృవీకరణ నియమాలను ప్రవేశపెట్టండి. మీ రెయిన్ సర్జ్ 6 గంటలకు పైగా ఉంది! నా ట్వీట్ సమయాన్ని తనిఖీ చేయండి! ప్రదేశం: వైట్‌ఫీల్డ్, బెంగళూరు" అని ఆయన పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా, జొమాటో ఇటీవల తన గోల్డ్ సభ్యులకు కూడా వర్షం కురిసే సమయంలో విధించే సర్జ్ ఫీజుల నుండి మినహాయింపు ఉండదని తెలియజేసింది. "మే 16 నుంచి, వర్షాల సమయంలో సర్జ్ ఫీజు మినహాయింపు మీ గోల్డ్ ప్రయోజనాల్లో భాగంగా ఉండదు" అని యాప్‌లో నోటిఫికేషన్ ద్వారా యూజర్లకు సమాచారం అందించింది. కష్టమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే డెలివరీ భాగస్వాములకు మెరుగైన పరిహారం అందించడంలో ఈ అదనపు ఛార్జీ సహాయపడుతుందని జొమాటో పేర్కొన్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ, వర్షం లేనప్పుడు కూడా రెయిన్ సర్జ్ ఫీజు విధించడంపై యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Zomato
Zomato rain surge fee
food delivery apps
platform fees
Bengaluru
Prakhyat Rai
Whitefield
food delivery charges
delivery partners
surge pricing

More Telugu News