Chandrababu Naidu: ఈ నెల 23 నుంచి ఇంటింటికీ ‘తొలి అడుగు’ విజయయాత్ర: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Announces Toli Adugu Campaign for Andhra Pradesh
  • టీడీపీ శ్రేణులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
  • త్వరగా పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటుకు ఆదేశం
  • జూలైలో పార్టీ నేతలు, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణా శిబిరాలు
  • వచ్చే వారమే 'అన్నదాత సుఖీభవ' పథకం ప్రారంభం
  • 'తల్లికి వందనం' నిధులు విడుదల, తల్లిదండ్రుల హర్షం
  • రేపు లక్ష చోట్ల అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక కార్యక్రమాలు
కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ నెల 23వ తేదీ నుంచి నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 'సుపరిపాలనలో తొలి అడుగు' పేరుతో ఇంటింటికీ విజయయాత్ర నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ యాత్ర ద్వారా... ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో శుక్రవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ విజయయాత్రలో నాయకుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ పాల్గొని, ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రచారం చేయడంలో పోటీపడాలని ముఖ్యమంత్రి కోరారు. "మొదటి ఏడాది మనం ఏం చేశామో చెప్పడంతో పాటు, ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి. మనం సాధిస్తున్న విజయాలు చూసి తట్టుకోలేకనే వారు మహిళలను అవమానించడం, దాడులకు దిగడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు" అని చంద్రబాబు అన్నారు. 

మహానాడు విజయవంతమైందని విశ్రాంతి తీసుకోవద్దని, పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి కమిటీలలో సముచిత స్థానం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. 'కుటుంబ సాధికార సారథి'లో చురుగ్గా ఉన్నవారికే పార్టీలో పదవులు లభిస్తాయని, కార్యకర్తలు నిత్యం చైతన్యవంతంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

'సంక్షేమ పథకాల జోరు, ఆర్థిక క్రమశిక్షణ'

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేశామని, ఎంతమంది పిల్లలున్నా ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూరేలా నిధులు విడుదల చేశామని సీఎం తెలిపారు. "మొత్తం 67.27 లక్షల మంది విద్యార్థులకు గాను, తల్లుల ఖాతాల్లోకి రూ.13,000 చొప్పున, పాఠశాలల అభివృద్ధికి రూ.2,000 చొప్పున జమ చేస్తున్నాం. ఈ పథకం కింద రూ.8,747 కోట్లు కేటాయించాం. 

గత ప్రభుత్వం 42 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసి రూ.5,540 కోట్లు ఖర్చు చేస్తే, మనం అదనంగా 25 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తూ, ఏటా రూ.3,205 కోట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం" అని చంద్రబాబు వివరించారు. నలుగురు పిల్లలు ఉన్న తల్లికి రూ.52,000 అందుతాయని, ఇంత పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తున్నా కొందరు బుద్ధి, జ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని ఈ నెల 20వ తేదీన ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద ఏటా రూ.34 వేల కోట్లు అందిస్తున్నామని, అన్నా క్యాంటీన్ల ద్వారా ఇప్పటికే 4 కోట్ల భోజనాలు సరఫరా చేశామని గుర్తుచేశారు.

యోగా దినోత్సవానికి భారీ ఏర్పాట్లు, పార్టీ కార్యకర్తలకు శిక్షణ


రాష్ట్రంలో 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని 5 లక్షల మందితో నిర్వహించనున్నామని సీఎం తెలిపారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాలో పాల్గొనేలా లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటికే 2.21 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. "యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి. ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన సమాజ నిర్మాణమే మన లక్ష్యం. రేపు (శనివారం) లక్ష చోట్ల యోగా దినోత్సవ సన్నాహక కార్యక్రమాలు జరుగుతాయి" అని వెల్లడించారు.

జూలై నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులకు నాయకత్వ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామని, కార్యకర్తలను సమర్థవంతమైన నాయకులుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలో లేనప్పుడు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, ఎమ్మెల్యేలు కూడా ప్రతిరోజూ పార్టీ కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించి, ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు.


Chandrababu Naidu
TDP
Telugu Desam Party
Andhra Pradesh
YSRCP
Anna Canteens
Rythu Runa Maafi
Mahila Sadhikara
Yogandhra
World Yoga Day

More Telugu News