Pardhi Gang: హైదరాబాదులో పార్థి గ్యాంగ్ మెంబర్స్ అరెస్ట్

Pardhi Gang Members Arrested in Hyderabad Sandalwood Theft
  • పగలు రెక్కీ నిర్వహిస్తూ రాత్రి పూట గంధపు చెక్కలు చోరీ
  • పార్థి గ్యాంగ్ కు చెందిన నలుగురు మహిళల అరెస్టు
  • పరారీలో మరో 19 మంది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల పార్థి గ్యాంగ్ సభ్యులు
హైదరాబాద్ నగరంలో శ్రీగంధం చెట్లను నరికి చోరీ చేస్తున్న పార్ధి ముఠాకు చెందిన నలుగురు మహిళలను జూబ్లీహిల్స్ పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీస్ అధికారి మధుసూధన్ తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.5లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలప్రసాద్ ఇంటి ఆవరణలో ఉన్న శ్రీగంధం చెట్లను కొందరు వ్యక్తులు రెండు రోజుల క్రితం నరికి, చెక్కలను అపహరించారు. మరుసటి రోజు చెట్లు నరికిన విషయాన్ని గుర్తించిన బాలప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పార్థి తెగకు చెందిన ముఠా నగరంలో శ్రీగంధం చెట్లను నరికి చోరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 40 నుంచి 50 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, నిందితులు జూబ్లీహిల్స్ నుంచి ఉప్పల్ వరకు ఆటోలో ప్రయాణించినట్లు తేలింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్‌ను విచారించగా, కొంతమంది మహిళలు తన ఆటోలో ఎక్కి ఉప్పల్‌లో దిగారని చెప్పాడు. ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉప్పల్ చెరువు సమీపంలో గాలింపు చర్యలు చేపట్టి నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో పోలీసులను చూసి మరికొందరు పరారయ్యారు.

పట్టుబడిన మహిళలను విచారించగా, 20 పార్థి కుటుంబాలకు చెందిన తాము 20 రోజుల క్రితం నగరానికి వచ్చామని, పిల్లలు, పెద్దలతో కలిసి పగటిపూట రెక్కీ నిర్వహించి, రాత్రి సమయాల్లో శ్రీగంధం చెట్లను నరికి దుంగలను చోరీ చేస్తుంటామని అంగీకరించారు. గంధం చెక్కలకు మార్కెట్లో గ్రేడ్‌లను బట్టి టన్నుకు రూ.9 వేల నుంచి రూ.18 వేల వరకు ధర పలుకుతుందని వెల్లడించారు. కాలనీల్లో తిరుగుతూ వస్తువులను విక్రయిస్తున్నట్లుగా నటిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా శ్రీగంధం చెట్లను గుర్తిస్తారని పోలీసుల విచారణలో తేలింది.

ఈ ఘటనలో మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాకు చెందిన పాలన్ బపాయి పర్ధీ (26), షాహనాజ్ బాయ్ (35), నిమత్ బాయి (43), మాధురీ అదివాసీ (25)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో 19 మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. 
Pardhi Gang
Hyderabad Crime
Sandalwood Theft
Jubilee Hills
Madhusudhan Police
Balaprasad IAS
Uppal
Telangana Crime
Sandalwood Smuggling

More Telugu News