KTR: కేటీఆర్‌పై కేసు న‌మోదు చేసిన‌ హైద‌రాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు.. కార‌ణ‌మిదే!

KTR Case Filed by Hyderabad Cyber Crime Police Details Here
  • సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత‌ వ్యాఖ్య‌లు చేశార‌ని కేటీఆర్‌పై ఆరోపణలు
  • కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు
  • బీఎన్ఎస్ సెక్షన్ 353(2), 352 కింద కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు
  • సీఎం ప్రతిష్టను దెబ్బతీసి, శాంతికి భంగం కలిగించేలా వ్యాఖ్యలని ఫిర్యాదులో ఆరోపణ
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌న్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రేవంత్ రెడ్డిని కించపరిచేలా, ఆయన ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ తన ఫిర్యాదులో ఆరోపించారు. కేటీఆర్ చేసిన నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలతో కూడిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 

ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణ కమిషన్ ప్రశ్నిస్తున్న సున్నితమైన తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజా శాంతికి భంగం కలిగించే ప్రమాదం ఉందని ఫిర్యాదులో వివరించారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా పలు సోషల్ మీడియా పోస్టులను కూడా ఆధారాలుగా సమర్పించారు.

అందుకున్న ఫిర్యాదు, సాక్ష్యాధారాల ఆధారంగా పోలీసులు కేటీఆర్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 353(2) (ప్రజా శాంతికి భంగం కలిగించే ప్రకటనలు చేయడం), సెక్షన్ 352 (శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద కేసు నమోదు చేశారు.
KTR
KTR case
Revanth Reddy
Cyber Crime Hyderabad
BRS
Balmoori Venkat
Kaleshwaram Project
Telangana Politics
Defamation case
Telangana CM

More Telugu News