Iran-Israel Conflict: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీక‌ర యుద్ధం.. పరస్పర దాడులతో భగ్గుమన్న పశ్చిమాసియా!

Israel strikes Irans nuclear sites and kills top generals Iran retaliates with missile barrages
  • ఇరాన్ అణు, సైనిక కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
  • కీలక సైనికాధికారులు, శాస్త్రవేత్తలు మృతి చెందినట్లు సమాచారం
  • ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ ప్రతీకార దాడులు
  • టెల్ అవీవ్‌లో క్షిపణి దాడులు, ఏడుగురికి గాయాలు
  • జెరూసలెం, టెల్ అవీవ్ నగరాలపై దాడులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్
  • టెహ్రాన్ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం, కొనసాగుతున్న ఉద్రిక్తత
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఇరాన్ అణు, సైనిక కార్యక్రమాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ శుక్రవారం భీకర దాడులకు దిగింది. ఇరాన్ అణుబాంబు తయారీకి చాలా దగ్గరగా వచ్చిందని, దానిని నిలువరించేందుకే ఈ దాడులు అవసరమని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్‌లోకి రహస్యంగా తరలించిన యుద్ధ విమానాలు, డ్రోన్ల సహాయంతో కీలక స్థావరాలపై దాడులు చేసి, పలువురు ఉన్నత స్థాయి సైనికాధికారులు, శాస్త్రవేత్తలను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 

ఇరాన్ యురేనియంను ఆయుధంగా మార్చే విషయంలో తిరుగులేని స్థితికి (పాయింట్ ఆఫ్ నో రిటర్న్) చేరుకుంటోందని ఇటీవల రహస్య నివేదిక హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ అణు ముప్పును నాశనం చేయడ‌మే లక్ష్యంగా ఈ దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ శుక్రవారం రాత్రి తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్‌పై వందలాది బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. 150కి పైగా బాలిస్టిక్ క్షిపణులు, 100కు పైగా డ్రోన్లను ప్రయోగించినట్లు సమాచారం. ఈ దాడులతో జెరూసలెం, టెల్ అవీవ్ నగరాల్లో ఆకాశంలో భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో షెల్టర్లలోకి పరుగులు తీశారు. 

టెల్ అవీవ్‌లో కనీసం రెండు ఇరాన్ క్షిపణులు నేలపై పడినట్లు అసోసియేటెడ్ ప్రెస్ జర్నలిస్టులు తెలిపారు. ఇరాన్ దాడుల్లో టెల్ అవీవ్‌లో ఏడుగురికి గాయాల‌య్యాయి. వారు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారని, వారిలో ఒకరి పరిస్థితి మినహా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయని ఇజ్రాయెల్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ తెలిపింది. నగరంలోని ఓ భవనంపై ప్రొజెక్టైల్ పడటంతో వీరు గాయపడ్డారు.

శనివారం తెల్లవారుజామున జెరూసలెం గగనతలంలో మరోసారి సైరన్లు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇవి ఇజ్రాయెల్ ఇంటర్‌సెప్టార్ల చర్యల వల్ల కావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే క్షిపణి దాడులతో భయాందోళనలకు గురైన పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది.

మరోవైపు, టెహ్రాన్‌లోని మెహరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంటలు చెలరేగినట్లు ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థ తస్నీమ్ వెల్లడించింది. విమానాశ్రయం నుంచి పొగలు, నారింజ రంగు మంటలు ఎగసిపడుతున్న వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. 

ఇరాన్‌ను చర్చలకు రప్పించడం లేదా దాని అణు కార్యక్రమాన్ని శాశ్వతంగా నిర్వీర్యం చేయడం లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపట్టిన ఈ వైమానిక దాడులు రాబోయే రోజుల్లో ఇరుపక్షాలు సుదీర్ఘ ఘర్షణకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తుండటంతో మరిన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
Iran-Israel Conflict
Israel
Iran
Middle East Conflict
Israel attacks Iran
Iran nuclear program
Tel Aviv
Jerusalem
Ballistic missiles
War

More Telugu News