Samantha: సక్సెస్‌కు కొత్త భాష్యం చెప్పిన నటి సమంత!

Actress Samantha Ruth Prabhu Shares Her Views on Success and Freedom
  • విజయం అంటే స్వేచ్ఛేనని స్పష్టం చేసిన సమంత
  • గతంతో పోలిస్తే ఇప్పుడే ఎక్కువ విజయవంతంగా ఉన్నానన్న నటి
  • దాదాపు రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న సమంత
  • ఇటీవల ‘శుభం’ సినిమాలో అతిథి పాత్రలో మెరిసిన వైనం
  • ‘మా ఇంటి బంగారం’ చిత్రం ప్రకటన
ప్రముఖ కథానాయిక సమంత తన దృష్టిలో విజయం అంటే స్వేచ్ఛను పొందడమేనని అన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం మరింత ఎక్కువ విజయాన్ని సొంతం చేసుకున్నట్టు భావిస్తున్నానని తెలిపారు. దాదాపు రెండేళ్ల విరామం అనంతరం సినిమాల్లో తన ప్రయాణం, వ్యక్తిగత ఎదుగుదల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

విజయం గురించి తన అభిప్రాయాన్ని వివరిస్తూ "విజయానికి నిర్వచనం ఏమిటని అడిగితే నేను వెంటనే స్వేచ్ఛ అని చెబుతాను. నిరంతరం అభివృద్ధి చెందడం, పరిణితి సాధించడం, దేనికీ బందీగా ఉండకపోవడమే నా దృష్టిలో నిజమైన స్వేచ్ఛ. అదే అసలైన విజయం" అని సమంత పేర్కొన్నారు. గత రెండేళ్లుగా తన సినిమా ఏదీ విడుదల కాకపోయినా, ఈ విరామ సమయంలో తాను ఎంతో స్వేచ్ఛగా ఉన్నానని ఆమె తెలిపారు. "బహుశా నా చుట్టూ ఉన్నవారు, గతంతో పోలిస్తే నేనిప్పుడు విజయం సాధించలేదని అనుకోవచ్చు. కానీ, నా వ్యక్తిగత దృష్టిలో మాత్రం నేను గతం కంటే ఎక్కువ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాను. నేను ప్రస్తుతం చేస్తున్న పనులు నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి. వాటిని పూర్తి చేయడం కోసం ప్రతిరోజూ ఎంతో ఆనందంగా నిద్రలేస్తున్నాను" అని సమంత వివరించారు.

సినిమాల విషయానికొస్తే సమంత పూర్తిస్థాయి ప్రధాన పాత్రలో కనిపించి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. ఇటీవల విడుదలైన ‘శుభం’ చిత్రంలో ఆమె మాతాజీ అనే ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాకుండా, ఈ సినిమాతో సమంత తొలిసారిగా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని సమాచారం. త్వరలోనే మరిన్ని వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తానని సమంత ఇటీవల అభిమానులకు హామీ ఇచ్చారు.
Samantha
Samantha Ruth Prabhu
actress Samantha
Success
Shubham Movie
Ma Inti Bangaram
Samantha production
Tollywood
actress interview
freedom

More Telugu News