London Hindu Attack: మీది ఏ దేశం? అని అడిగి మరీ.. లండన్‌లో హిందూ యువకులను చితకబాదారు!

Racist Attack on Hindu Youth in London
  • లండన్‌లో ముగ్గురు బ్రిటిష్ హిందూ యువకులపై అమానుష దాడి
  • ఇది మత విద్వేషంతో జరిగిన దాడేనని బ్రిటిష్ ఎంపీ ఆరోపణ
  • జాతి వివక్ష దాడి అనడానికి ఆధారాలు లేవంటున్న పోలీసులు
లండన్‌లో ముగ్గురు బ్రిటిష్ హిందూ యువకులపై కొందరు వ్యక్తులు అమానుషంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు భారతీయులు, శ్రీలంకకు చెందిన వారని తెలుసుకున్న తర్వాతే ఈ దాడి జరిగిందని సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పృహ కోల్పోగా, ముగ్గురికి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఇది మత విద్వేషంతో జరిగిన దాడేనని అధికార టోరీ పార్టీకి చెందిన ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ బ్రిటిష్ పార్లమెంటులో ఆరోపించారు. అయితే, పోలీసులు మాత్రం ఇది జాతి వివక్ష దాడి అనడానికి ప్రస్తుతం ఆధారాలు లేవని చెబుతున్నారు.

అసలేం జరిగింది?
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. మే 30న 20-21 ఏళ్ల వయసున్న ముగ్గురు హిందూ యువకులు లండన్‌లోని హ్యారో రిక్రియేషన్ గ్రౌండ్‌కు క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో పార్కులోని ఓ కేఫ్ వద్ద కొందరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వారిలో కొందరు మహిళలు హిజాబ్ ధరించి ఉండటంతో వారు ముస్లిం కుటుంబానికి చెందినవారై ఉండొచ్చని బాధితులు భావించారు. ఆ సమయంలో కేఫ్ వద్ద ఉన్న ఓ వ్యక్తి యువకులను అడ్డగించి "మా కుటుంబం వైపు ఎందుకు చూస్తున్నారు?" అని ప్రశ్నించాడు. దానికి యువకులు బదులిస్తూ స్నేహితులు క్రికెట్ ఆడటాన్ని చూస్తున్నామని, వారి కుటుంబాన్ని చూడలేదని సమాధానమిచ్చారు. దీంతో అప్పటికి ఆ వివాదం సద్దుమణిగినట్టే కనిపించింది.

సుమారు 30 నిమిషాల అనంతరం పార్కులో ఓ బెంచ్‌పై కూర్చున్న ఈ యువకుల వద్దకు 20 ఏళ్లున్న యువకుడు వచ్చాడు. "మీరు ఎక్కడివారు? శ్రీలంక వారా? భారతీయులా?" అని ప్రశ్నించాడు. బాధితుల్లో ఒకరైన శ్రీలంక యువకుడు "అవును, మేం భారతీయులం, శ్రీలంక వారం" అని చెప్పిన వెంటనే ముగ్గురు పెద్ద వయసు వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారని బాధితుల్లో ఒకరైన బ్రిటిష్ ఇండియన్, గుజరాతీ హిందూ యువకుడి సోదరి మీడియాకు తెలిపారు. దుండగులు వారిని కిందపడేసి విచక్షణరహితంగా తన్నారని, పిడిగుద్దులు కురిపించారని వాపోయారు.

బయటకు రావాలంటేనే భయం
దాడి జరిగినప్పుడు తన సోదరుడి చేతికి గుడిలో కట్టించుకున్న పవిత్ర దారం (రక్ష) ఉందని బాధితుడి సోదరి తెలిపారు. దాడి చేసిన వారిలో ఒక వ్యక్తి మొరాకో ఫుట్‌బాల్ టీషర్ట్ ధరించి ఉన్నాడని, దానిపై "హకీమీ" అనే పేరు, "2" అనే నంబర్ ఉన్నాయని ఆమె గుర్తుచేశారు. "ఈ ఘటన తర్వాత నా సోదరుడు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నాడు. బయటకు రావాలంటేనే భయపడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు. అతను ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. ఇటీవలే మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తిచేశాడు. దాడి జరిగిన తర్వాతి వారం నుంచి రెండు వారాల క్లినికల్ ప్లేస్‌మెంట్‌కు వెళ్లాల్సి ఉండగా, అది కూడా వాయిదా పడింది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించలేదని, పోలీసుల దర్యాప్తు తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

పోలీసులు, ఎంపీ ఏమంటున్నారు?
ఈ ఘటనపై మెట్రోపాలిటన్ పోలీసులు స్పందిస్తూ ఘటనా స్థలంలో "గొడవ" జరిగిందని తమకు సమాచారం అందిందని, ఒక వ్యక్తి తలకు గాయాలవడంతో ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అయితే, ఈ దాడి జాతి వివక్షతో జరిగిందని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని, దర్యాప్తు కొనసాగుతోందని వారు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.

మరోవైపు, గురువారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన టోరీ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్, ఇది "మత విద్వేషంతో" జరిగిన దాడి అని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. లండన్ వంటి నగరంలో ఇలాంటి దాడులు జరగడం ఆందోళనకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
London Hindu Attack
Hindu youth
London
Harrow Recreation Ground
Racist attack
Bob Blackman
Srilankan
Indian

More Telugu News