Ruyangsurak: విమాన ప్రమాదాల్లో అంతుచిక్కని సారూప్యత.. బయటపడిన ఇద్దరిదీ ఒకే సీట్ నంబర్!

Ruyangsak Loychusak Plane Crash Survivor Shares Eerie Coincidence
  • 1998 థాయ్ విమాన ప్రమాదంలో బతికిన గాయకుడు రుయాంగ్‌సాక్ జేమ్స్
  • అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో బతికిన వ్యక్తిది కూడా అదే సీటు
  • ఇద్దరూ ప్రయాణించింది 11ఎ నంబర్ సీట్లోనేనని వెల్లడి
  • ఈ సారూప్యత చూసి ఒళ్లు గగుర్పొడిచిందన్న థాయ్ సింగర్
  • ప్రమాదం తర్వాత పదేళ్లపాటు తీవ్ర మానసిక ఆందోళన అనుభవించానన్న రుయాంగ్‌సాక్
విమాన ప్రమాదాలు అత్యంత విషాదకరమైనవి. అలాంటి ఘోర ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడటం అద్భుతమనే చెప్పాలి. అయితే, రెండు వేర్వేరు విమాన ప్రమాదాల్లో, వేర్వేరు కాలాల్లో ప్రాణాలతో బయటపడిన ఇద్దరు వ్యక్తుల విషయంలో ఓ విచిత్రమైన సారూప్యత వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ ప్రయాణించిన సీటు నంబర్ ఒకటే కావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వింత కాకతాళీయంపై థాయ్‌లాండ్‌కు చెందిన ప్రముఖ గాయకుడు రుయాంగ్‌సాక్ జేమ్స్ లోయ్‌చుసాక్ (47) సోషల్ మీడియాలో పంచుకున్న విషయాలు వైరల్ అవుతున్నాయి.

1998లో జరిగిన థాయ్ ఎయిర్‌వేస్ విమాన ప్రమాదంలో రుయాంగ్‌సాక్ ప్రాణాలతో బయటపడ్డారు. ఆ దుర్ఘటనలో 101 మంది మరణించగా, కేవలం 45 మంది మాత్రమే బతికారు. సూరత్ థానీలో ల్యాండ్ అవుతుండగా టీజీ261 విమానం చిత్తడి నేలలో కుప్పకూలింది. అప్పుడు తాను ప్రయాణించిన సీటు నంబర్ 11A అని రుయాంగ్‌సాక్ గుర్తుచేసుకున్నారు. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఒంటరిగా ప్రాణాలతో బయటపడిన విశ్వాస్‌కుమార్ రమేశ్ కూడా అదే 11ఎ నంబర్ సీటులో కూర్చున్నారని తెలిసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన తెలిపారు. "భారత్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఒంటరిగా ప్రాణాలతో బయటపడిన వ్యక్తి నాలాగే 11ఎ సీటు నంబర్‌లో కూర్చున్నారు. ఇది చూసి నా ఒళ్లు గగుర్పొడిచింది" అని లోయ్‌చుసాక్ ఫేస్‌బుక్‌లో రాశారు.

ఆనాటి ప్రమాదం తన జీవితంలో తీవ్రమైన మానసిక గాయాన్ని మిగిల్చిందని రుయాంగ్‌సాక్ ఆవేదన వ్యక్తం చేశారు. "దాదాపు పదేళ్లపాటు విమానం ఎక్కాలంటేనే భయపడేవాడిని. జనాలను కలవడం మానేశాను. ఆకాశంలో మేఘాలు కనిపిస్తే చాలు ఆందోళనకు గురయ్యేవాడిని" అని ఆయన నాటి భయానక రోజులను గుర్తుచేసుకున్నారు. "ఆ సమయంలో నేను ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు, ఎప్పుడూ కిటికీ వెలుపలే చూస్తూ ఉండేవాడిని. నా భద్రతా భావన కోసం కిటికీని ఎవరైనా మూయడానికి ప్రయత్నిస్తే అడ్డుకునేవాడిని. బయట దట్టమైన మేఘాలు లేదా వర్షపు తుపాను కనిపిస్తే, నేను నరకంలో ఉన్నట్టు భయంకరంగా అనిపించేది" అని ఆయన చెప్పినట్టు ‘ మెయిల్‌ఆన్‌లైన్’ ప్రచురించింది. "విమానం కూలిపోయిన చిత్తడి నేలల్లోని నీటి వాసన, శబ్దాలు, చివరికి రుచి కూడా నాకు ఇంకా గుర్తున్నాయి. చాలా కాలం పాటు ఆ భావనలను నాలోనే దాచుకున్నాను" అని కూడా ఆయన తెలిపారు.

తన వద్ద పాత బోర్డింగ్ పాస్ లేనప్పటికీ, అప్పటి వార్తాపత్రికల కథనాలు తన సీటు నంబర్‌ను ధ్రువీకరించాయని రుయాంగ్‌సాక్ చెప్పారు. ఇటీవలి ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారందరికీ ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రాణాలతో బయటపడటం తనకు "రెండో జీవితాన్ని" ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
Ruyangsurak
Thai Airways Flight 261
Air India accident
Seat number 11A
विमान दुर्घटना
Ahmedabad plane crash
Thailand plane crash
Vishwas Kumar Ramesh
Flight accident survivor
Coincidence

More Telugu News