Boeing 11A: అందరూ వద్దనుకునే సీటే ప్రాణదాత.. బోయింగ్ 11ఏ

 Boeing 11A Seat Saved Life in Ahmedabad Crash
  • కిటికీ లేకపోవడంతో 11ఏ సీటుపై ప్రయాణికుల అనాసక్తి
  • ఎయిర్ కండిషనింగ్ డక్ట్ కారణంగానే కిటికీకి ఆస్కారం లేదట
  • అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఆ సీటే విశ్వాస్ ను కాపాడింది
సాధారణంగా విమాన ప్రయాణాల్లో సౌకర్యవంతమైన సీటు కోసం అదనంగా డబ్బు చెల్లించడానికి కూడా ప్రయాణికులు సిద్ధపడతారు. బోయింగ్ విమానాల్లో ప్రయాణించే చాలా మంది 11ఏ సీటును అంతగా ఇష్టపడరు. అయితే, అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఈ సీటుపై ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది.

బోయింగ్ విమానాల్లో 11ఏ సీటును ఇష్టపడకపోవడానికి మూఢనమ్మకమేమీ కారణం కాదు.. ఈ సీటు విమానం బాడీకి పక్కనే ఉంటుంది కానీ విండో ఉండదు. సరిగ్గా దీని వెనక ఉండే 12ఏ సీటుకు విండో ఉంటుంది. బోయింగ్ 737, 787 వంటి విమానాల్లో క్యాబిన్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థకు సంబంధించిన డక్ట్ సరిగ్గా 11ఏ సీటు పక్కగా వెళ్తుంది. దీనివల్ల అక్కడ కిటికీ ఏర్పాటు చేయడానికి వీలుండదు.

ఇది ఎమర్జెన్సీ మార్గం పక్కన ఉండే సీటే అయినప్పటికీ, ప్రయాణ సమయంలో చిన్న బ్యాగులను కాళ్ల దగ్గర ఉంచుకోవడానికి వీలుకాకపోవడం కూడా కొందరికి అసౌకర్యంగా అనిపిస్తుంది. వస్తువులు తీసుకోవడానికి పదేపదే లేచి నిలబడాల్సి వస్తుంది. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రయాణికులు అందరూ మరణించినా 11ఏ సీటులో కూర్చున్న బ్రిటన్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేశ్ మాత్రమే అద్భుత రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు. 

దీనిపై విమానయాన విశ్లేషకుడు గై లీచ్ అభిప్రాయం ప్రకారం.. ప్రమాద సమయంలో 11ఏ సీటు విమానం నుంచి బయటకు విసిరేయబడి ఉండవచ్చని, అందుకే రమేశ్‌కు తీవ్ర గాయాలు కాలేదన్నారు. ఈ ఘటనతో ఒకప్పుడు ఎవరూ వద్దనుకున్న 11ఏ సీటు, ఇప్పుడు ఒక అదృష్టానికి ప్రతీకగా మారిందనే చర్చ మొదలైంది.
Boeing 11A
Ahmedabad plane crash
Air India
flight accident
Vishwas Kumar Ramesh
miraculous survival
aviation analysis
Guy Leech
Boeing 737
Boeing 787

More Telugu News