Pawan Kalyan: కూర్మ గ్రామంలో అగ్ని ప్రమాదం దురదృష్టకరం: పవన్ కల్యాణ్

Pawan Kalyan Reacts to Fire Accident in Khurma Village
  • కూర్మలో ఆధ్యాత్మిక కేంద్రానికి నిప్పు, భారీ ఆస్తి నష్టం
  • దుండగుల పనేనని నిర్వాహకుల ఆరోపణ, దర్యాప్తు ముమ్మరం
  • ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
  • లోతైన విచారణ జరపాలని పోలీసులకు ఆదేశం
  • కూర్మ గ్రామ పునరుద్ధరణకు పూర్తి సహాయంపై భరోసా
శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండల పరిధిలోని కూర్మ గ్రామంలో ప్రశాంతతకు భంగం వాటిల్లింది. ఆధ్యాత్మిక చింతనతో, ప్రకృతి ఒడిలో జీవనం సాగించే ఈ గ్రామంలోని ఇస్కాన్ రాధాకృష్ణ మందిరం కొన్నిరోజుల కిందట జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది.  ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఎవరైనా దుండగులు ఉద్దేశపూర్వకంగా నిప్పుపెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి దుశ్చర్యలు జరిగాయని మందిర నిర్వాహకుల్లో ఒకరైన ప్రభుదాస్ పోలీసులకు వివరించారు.

ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూర్మ గ్రామంలో అగ్ని ప్రమాదం దురదృష్టకరం అని పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి, నిజానిజాలు నిగ్గు తేల్చాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.

"ఆధునిక హంగులు లేకుండా అధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న కూర్మ గ్రామం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరం. శ్రీకాకుళం జిల్లా హిరమండలం సమీపంలోని కూర్మ గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై పోలీసులు లోతుగా విచారణ చేయాలని సంబంధిత యంత్రాంగానికి సూచనలు చేశాను. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలి. కూర్మ గ్రామంలో ప్రస్తుత పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాము. సనాతన ధార్మిక జీవనం కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పాటైంది. కూర్మ గ్రామవాసులు యాంత్రిక జీవన విధానాలకు భిన్నంగా మట్టి ఇళ్ళల్లో ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేసుకొంటూ జీవిస్తున్నారు. వేద విద్యను అభ్యసించే చిన్నారులు సంస్కృతం, తెలుగు, హిందీ, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. వర్తమాన కాలంలో విశిష్టంగా ఉన్న ఈ గ్రామం పునరుద్ధరణపై దృష్టి సారించాలి" అని పవన్ స్పష్టం చేశారు.

Pawan Kalyan
Khurma Village
Andhra Pradesh
Fire Accident
ISKCON Temple
Srikakulam District
Hiramandalam
Police Investigation
Religious Harmony
Deputy CM AP

More Telugu News