UIDAI: ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు మళ్ళీ పొడిగింపు: మరో ఏడాది ఛాన్స్!

UIDAI Extends Free Aadhar Update Deadline to 2026
  • ఆధార్ డాక్యుమెంట్లను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువు పెంపు
  • మరో ఏడాది పాటు, అంటే 2026 జూన్ 14 వరకు అవకాశం
  • భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఈ నిర్ణయం
  • ‘మై ఆధార్’ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌లోడ్
ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) శుభవార్తను అందించింది. ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది. ఈ ఉచిత సేవలకు వాస్తవానికి నేటితో (జూన్ 14) గడువు ముగియాల్సి ఉండగా, దానిని మరో ఏడాది పాటు, అంటే 2026 జూన్ 14వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ 'ఎక్స్' వేదికగా ప్రకటించింది.

ఆధార్‌ను అప్‌డేట్‌గా ఉంచేందుకు డాక్యుమెంట్లను ఉచితంగా అప్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని మరోసారి కల్పిస్తున్నామని, దీనివల్ల లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని యూఐడీఏఐ వెల్లడించింది.

ఆధార్ కార్డులోని వివరాలను ఎప్పటికప్పుడు తాజాగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం గుర్తింపు ధృవీకరణ పత్రం (పీఓఐ), చిరునామా ధృవీకరణ పత్రం (పీఓఏ)లను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. వివాహం, ఉన్నత చదువులు లేదా ఉద్యోగ రీత్యా నివాసం మారిన వారికి ఈ అవకాశం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే, ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ గతంలోనే స్పష్టం చేసింది.

ఈ ఉచిత అప్‌డేట్ సేవలను ‘మై ఆధార్’ పోర్టల్ ద్వారా పొందవచ్చు. గతంలో ఆధార్ కేంద్రాలకు వెళ్లి వివరాలను మార్చుకోవాలంటే రూ. 50 రుసుము చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎటువంటి ఖర్చు లేకుండానే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకునే విధానం

- ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, మీ ఆధార్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.

- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత, మీ ప్రస్తుత వివరాలు తెరపై కనిపిస్తాయి.

- వాటిని ఒకసారి సరిచూసుకుని, ఏవైనా మార్పులు ఉంటే వాటిని సరిచేయాలి. లేదా అన్నీ సరిగ్గా ఉంటే, ఆ వివరాలను ధృవీకరించి ‘నెక్స్ట్’ బటన్‌పై క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత, అవసరమైన డాక్యుమెంట్లను డ్రాప్‌డౌన్ జాబితా నుంచి ఎంచుకోవాలి. వాటి స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేసి, ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయాలి.

- ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు 14 అంకెల ‘అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్’ (యూఆర్‌ఎన్) వస్తుంది. ఈ నంబర్‌తో మీ అప్లికేషన్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
UIDAI
Aadhar Update
Aadhar Free Update
UIDAI Update
My Aadhar Portal
Aadhar Card

More Telugu News