Harish Rao: ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు.. రేవంత్ రెడ్డి, కేంద్రంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

Harish Rao Slams Revanth Reddy Government on Andhra Pradesh Project
  • బనకచర్ల మరో పోతిరెడ్డిపాడు అవుతుందని హరీశ్ రావు ఆందోళన
  • బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ముందుకెళుతుంటే తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుందని విమర్శ
  • రాష్ట్ర ప్రయోజనాల కంటే కేసులపైనే ప్రభుత్వానికి ధ్యాస అని ఆరోపణ
  • నిధులు, నదుల విషయంలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని వ్యాఖ్య
కృష్ణా నదీ జలాలను అక్రమంగా తరలించుకుపోవడానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఏ విధంగా ఉపయోగపడిందో, అదే విధంగా గోదావరి జలాలను తరలించుకోవడానికి బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణ పనులను చురుగ్గా చేపడుతుంటే, మన ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది" అని హరీశ్ రావు విమర్శించారు. ఈ నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా నిద్రలోనే ఉందని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం ఉత్తుత్తి మాటలతో కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా ముందుకు రావడం లేదని, కేటీఆర్‌పై ఎలా కేసులు పెట్టాలనే దానిపై ఉన్న శ్రద్ధ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో లేదని ఆయన అన్నారు.

కేంద్రం తీరుపై విమర్శలు

కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా హరీశ్ రావు తప్పుపట్టారు. "గత రెండు కేంద్ర బడ్జెట్లను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు నిధుల వరద పారుతుంటే, తెలంగాణకు మాత్రం గుండు సున్నా దక్కింది. నిధులు ఆంధ్రాకే, నదులు ఆంధ్రాకే అన్నట్లుగా ఢిల్లీ పాలకుల తీరు ఉంది" అని ఆయన అన్నారు.

నిధుల కేటాయింపుల్లో, నదీ జలాల పంపకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు నోరు మెదపడం లేదని, రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా స్పందించడం లేదని విమర్శించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు ఇచ్చి మరీ సహకరిస్తోందని, తెలంగాణ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2 టీఎంసీల బాబ్లీ నీటి కోసం 2008లో చంద్రబాబు పోరాటం చేశారని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఏకంగా 200 టీఎంసీల నీటితో ఏపీ అక్రమ ప్రాజెక్టు కడుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎంతటి పోరాటం చేయాలో ఆలోచించాలని హరీశ్ రావు అన్నారు. తమకు రాజకీయాల కంటే రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని స్పష్టం చేశారు.

"ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఇంకా ఎక్కువ నష్టం జరగక ముందే గోదావరి-బనకచర్లను అడ్డుకోండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. మీరు ముందుకు రాకపోతే, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీనే పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది" అని హరీశ్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Harish Rao
Andhra Pradesh
Telangana
Godavari River
Banakacherla Project
Revanth Reddy

More Telugu News