KTR: సవాళ్లు కాదు, ఏసీబీ ముందుకు రా: కేటీఆర్‌కు ఆది శ్రీనివాస్ సవాల్

KTR Face ACB Inquiry Says Adi Srinivas
  • ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌కు భయం పట్టుకుందన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 
  • సీఎంకు సవాళ్లు విసరడం మానుకుని, ఏసీబీ విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు సూచన
  • గతంలో డ్రగ్స్ టెస్టుకు రమ్మంటే కేటీఆర్ పారిపోయారని ఆరోపణ
  • కేటీఆర్ బూతు మాటలను ప్రజలు చూస్తున్నారన్న ఆది శ్రీనివాస్
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు భయం పట్టుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శించారు. దమ్ముంటే ముఖ్యమంత్రికి సవాళ్లు విసరడం మానేసి, ఏసీబీ విచారణకు హాజరై వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ నోటీసులు అందుకున్న కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ సవాల్‌పై ఆది శ్రీనివాస్ తాజాగా ఒక వీడియో ప్రకటన ద్వారా స్పందించారు.

ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, "సవాళ్లు విసిరి వెనక్కి వెళ్లిపోయే సంస్కృతి బీఆర్ఎస్ నేతలది. గతంలో డ్రగ్స్ టెస్టుకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే పారిపోయింది ఎవరు? మీరా గొప్పలు చెప్పేది?" అని ప్రశ్నించారు. తెలంగాణను గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. మాటలు చెప్పడం కాదని, ఏసీబీ ముందు హాజరై విచారణకు సహకరించాలని కేటీఆర్‌కు సూచించారు.

కేటీఆర్ ఉపయోగిస్తున్న భాషపై కూడా ఆది శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. "కేటీఆర్ నోటి నుంచి వస్తున్న బూతు మాటలను తెలంగాణ సమాజం అంతా గమనిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా కేటీఆర్‌కు శిక్ష తప్పదని ఆది శ్రీనివాస్ జోస్యం చెప్పారు. ఫార్ములా-ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు కేటీఆర్ విచారణను ఎదుర్కోవాలని ఆయన డిమాండ్ చేశారు.
KTR
K Taraka Rama Rao
Adi Srinivas
BRS
Revanth Reddy
Formula E race
ACB investigation

More Telugu News