Allu Arjun: రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Allu Arjun Receives Telangana Gaddar Award from Revanth Reddy
  • హైదరాబాద్ హైటెక్స్‌లో వైభవంగా తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి చేతుల మీదుగా అవార్డుల అందజేత
  • 'పుష్ప-2' చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు పురస్కారం
  • ఉత్తమ నటిగా నివేదా థామస్, ఉత్తమ దర్శకుడిగా నాగ్‌ అశ్విన్‌ (కల్కి) 
  • ఉత్తమ హిస్టారికల్ ఫిల్మ్‌గా 'రజాకార్', ఉత్తమ తొలి చిత్రంగా 'కమిటీ కుర్రోళ్లు'
హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరై, చలనచిత్ర రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు కళాకారులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు.

ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ 'పుష్ప-2' సినిమాలో కనబరిచిన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటుడిగా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డును అందుకున్నారు. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన స్వీకరించారు.

ఈ వేడుకలో పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపికయ్యారు. 2024 సంవత్సరానికి గాను 'కల్కి' చిత్రానికి దర్శకత్వం వహించిన నాగ్‌ అశ్విన్‌ ఉత్తమ దర్శకుడిగా పురస్కారం అందుకున్నారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన 'రజాకార్‌' చిత్రం ఉత్తమ చారిత్రాత్మక చిత్రంగా నిలవగా, 'కమిటీ కుర్రోళ్లు' ఉత్తమ తొలి చిత్రంగా అవార్డును దక్కించుకుంది.

ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. 'కాంతారావు ఫిల్మ్ అవార్డు'ను విజయ దేవరకొండ, 'బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు'ను సుకుమార్, 'రఘుపతి వెంకయ్య అవార్డు'ను యండమూరి వీరేంద్రనాథ్, 'నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు'ను అట్లూరి పూర్ణ చంద్రరావు, 'పైడి జైరాజ్ అవార్డు'ను మణిరత్నం అందుకున్నారు.
Allu Arjun
Telangana Gaddar Awards
Revanth Reddy
Vijay Deverakonda
Pushpa 2

More Telugu News