Sachin Tendulkar: దక్షిణాఫ్రికా అపూర్వ విజయంపై సచిన్ స్పందన

Sachin Tendulkar Reacts to South Africas Historic Victory
  • ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపు
  • 27 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికాకు తొలి ఐసీసీ టైటిల్
  • సఫారీల విజయాన్ని కొనియాడిన సచిన్
క్రికెట్ ప్రపంచంలో దక్షిణాఫ్రికా జట్టు చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి, తొలిసారి ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా 27 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరపడింది. ఇంతకుముందు 1998లో ఆ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ (అప్పటి నాకౌట్ ట్రోఫీ) గెలుచుకుంది.

ఈ చారిత్రక విజయంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 'ఎక్స్' ద్వారా స్పందించారు. "టెస్ట్ క్రికెట్ తన మాయాజాలాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రతీ సెషన్ ఒక కొత్త కథను చెప్పిన ఈ ఫైనల్లో, దక్షిణాఫ్రికా తుపానులో ప్రశాంతతను కనుగొంది. మార్క్రమ్ సంయమనం, ఒత్తిడిలో బవుమా పట్టుదల నాలుగో ఇన్నింగ్స్‌లో గొప్పగా నిలిచాయి. చిరకాలం గుర్తుండిపోయే సెంచరీ ఇది, ఆశను చరిత్రగా మార్చిన భాగస్వామ్యం ఇది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌లుగా నిలిచిన దక్షిణాఫ్రికాకు అభినందనలు!" అని పేర్కొన్నారు.

282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఐడెన్ మార్క్రమ్ (136) అద్భుత శతకంతో వెన్నెముకలా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ ప్రదర్శనకు గాను మార్క్రమ్ "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డును అందుకున్నాడు.


Sachin Tendulkar
South Africa
World Test Championship
Aiden Markram
Cricket
WTC Final
Temba Bavuma
Australia
Lords

More Telugu News