Kommineni Srinivasa Rao: కొమ్మినేని విడుదలకు సెలవుల బ్రేక్.. సోమవారం సాయంత్రం బెయిల్‌పై బయటకు?

Kommineni Srinivasa Rao Release Delayed Due to Holidays
  • సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు విడుదలకు వరుస సెలవుల అడ్డంకి
  • సోమవారం వరకు జైల్లోనే ఉండనున్న కొమ్మినేని
  • శుక్రవారం సాయంత్రానికి అందని సుప్రీం కోర్టు బెయిల్ ఉత్తర్వులు
  • సోమవారం ట్రయల్ కోర్టులో బెయిల్ ఆర్డర్స్ పొందేందుకు న్యాయవాదుల యత్నం
  • మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టయిన కొమ్మినేని
  • కేసులో ప్రధాన నిందితుడు కృష్ణంరాజు ఇంకా గుంటూరు జైల్లోనే
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టయి జైలులో ఉన్న సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరైనప్పటికీ, ఆయన విడుదలకు వరుస సెలవులు ఆటంకంగా మారాయి. దీంతో ఆయన సోమవారం వరకు జైలులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాదులు వెల్లడించారు.

కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఆ ఉత్తర్వులు శుక్రవారం సాయంత్రం వరకు సంబంధిత కోర్టుకు చేరలేదు. దీంతో శుక్రవారం ఆయన విడుదల సాధ్యపడలేదు. మరుసటి రోజు రెండో శనివారం ప్రభుత్వ సెలవు దినం కావడంతో కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కొమ్మినేని తరఫు న్యాయవాదులు మేజిస్ట్రేట్‌ను ఆయన నివాసంలో కలిసి బెయిల్ ఆదేశాలు పొందేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం.

సోమవారం న్యాయవాదులు ట్రయల్ కోర్టులో కొమ్మినేని బెయిల్ ఉత్తర్వులను పొందేందుకు ప్రయత్నించనున్నారు. అన్నీ అనుకూలిస్తే, సోమవారం సాయంత్రం నాటికి కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాదులు చెప్పారు. ప్రస్తుతానికి ఆయన జైలులోనే ఉండనున్నారు.

కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణంరాజు ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లీగల్ సెల్ న్యాయవాదులు ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. అయితే, కృష్ణంరాజు మాత్రం సొంతంగా వేరే న్యాయవాదిని నియమించుకున్నట్టు సమాచారం.
Kommineni Srinivasa Rao
Sakshi TV
AP Capital
Andhra Pradesh
Bail Order
YSRCP Legal Cell
Krishnam Raju
Guntur Jail
Defamation Case
Supreme Court

More Telugu News