Chandrababu Naidu: ప్రభుత్వ శాఖల్లో అవినీతి సహించేది లేదు: ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Warns Against Corruption in Government Departments
  • అవినీతి రుజువైతే చర్యలు తప్పవన్న సీఎం చంద్రబాబు
  • ఆరోపణలు వస్తే తక్షణ విచారణ 
  • 10 ముఖ్యమైన ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరించాలని ఆదేశం
  • ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఏ శాఖలో, ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని, జీరో కరెప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ జరపాలని, అవినీతి రుజువైతే తక్షణం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏడాది పాలనపై ప్రజల నుంచి, వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వ్యక్తమైన అభిప్రాయాలపై నిన్న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైనట్లు ఐవీఆర్ఎస్, సీఎస్‌డీఎస్ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని, సమస్యలు ఉన్న చోట సంతృప్తి పెంచేలా చూడాలని సీఎం అన్నారు. సంక్షేమం, ఉద్యోగాల కల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. వర్క్ ఫ్రమ్ హోమ్, పెట్టుబడుల రాక, నైపుణ్య శిక్షణతో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియజేయాలన్నారు.

175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు, ఆగస్ట్ 15 కల్లా అన్ని సేవలను వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర కింద అందించాలని స్పష్టం చేశారు. మరోవైపు వికలాంగులు, వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి తీసుకువెళ్లి అందించడం మరింత మెరుగ్గా జరిగేలా ఆలోచన చేయాలన్నారు. చౌక ధరల దుకాణాలను పెంచడం, నగదు లేదా కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అలాగే ఉచిత ఇసుక విధానం అమలులో ఇసుక లేని చోట్ల సంతృప్తి, ఇసుక ఉన్న చోట అసంతృప్తి ఉండటంపై ప్రాంతాల వారీగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

ప్రజాభిప్రాయం ఇలా

పింఛన్ల పంపిణీలో అవినీతి లేదని 85 శాతం మంది, ఇంటి దగ్గరే ఇస్తున్నారని 87.8 శాతం, ఉద్యోగుల ప్రవర్తన బావుందని 83.9 శాతం మంది ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎస్‌డీఎస్ ఫీల్డ్ సర్వేలో లబ్ధిదారులను నేరుగా కలిసి ప్రశ్నించగా పింఛన్ల పంపిణీలో అవినీతి లేదని 93.9 శాతం మంది, ఇంటి దగ్గరే ఇస్తున్నారని 93.3 శాతం, ఉద్యోగుల ప్రవర్తన బావుందని 73.3 శాతం మంది, పర్వాలేదని 23.1 శాతం మంది చెప్పారన్నారు.

అన్న క్యాంటీన్లు పరిశుభ్రంగా ఉన్నాయని 80.5 శాతం, ఆహారం నాణ్యత బావుందని 79.3 శాతం, సమయపాలన పాటిస్తున్నారని 80.8 శాతం మంది ఐవీఆర్ఎస్ ద్వారా చెప్పారన్నారు. ఆస్పత్రి సేవలు క్వాలిటీ చెకప్‌పై 68.4 శాతం, రక్త పరీక్షలపై 55 శాతం, ఉచిత మందుల పంపిణీపై 65.5 శాతం, సిబ్బంది ప్రవర్తనపై 71.3 శాతం సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో రోజూ చెత్త సేకరణపై 68.1 శాతం, 24 గంటల్లో చెత్త డంప్ తరలింపుపై 57 శాతం సంతృప్తి చెందారని చెప్పారు.

ఆలయాలలో సౌకర్యాలకు సంబంధించి 68 శాతం దర్శనం బాగుందని, 63.6 శాతం సౌకర్యాలు బావున్నాయని, 77.7 శాతం ప్రసాదం నాణ్యత బావుందని భక్తులు చెప్పారన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీలో శుభ్రత, సీటింగ్ విషయంలో 53.4 శాతం, నీటి సౌకర్యం 45.2 శాతం, టాయిలెట్స్‌పై 56 శాతం, బస్సు సమయం-రూట్ వివరాలపై 61.5 శాతం, 69 శాతం మంది బస్సులు సమయానికి బయల్దేరుతున్నాయని, 69.7 శాతం సమయానికి చేరుకుంటున్నామని, 72.4 శాతం సిబ్బంది ప్రవర్తన బాగుందని, 69.7 శాతం రక్షణ కలిగి ఉన్నాయని చెప్పారన్నారు.

దీపం-2లో ఎక్కువ డబ్బు వసూళ్లు చేయడం లేదని 62.8 శాతం చెప్పారని అధికారులు వివరించారు. నెలనెలా రేషన్ సరుకులు తీసుకుంటున్నామని 75.1 శాతం, నాణ్యత బాగుందని 73.8 శాతం చెప్పారన్నారు.
ఎరువుల లభ్యత ఉందని 60.9 శాతం మంది రైతులు చెప్పారన్నారు. సమయానికి విత్తనాల సరఫరా జరిగిందని 63 శాతం, తమ ప్రాంతంలో డ్రగ్స్ సంబంధిత సమస్య ఉందని 27.4 శాతం, పోలీసులు స్పందిస్తున్నారని 54.5 శాతం, పబ్లిక్ ప్రాంతాల్లో వేధింపులు ఉన్నాయని 27.8 శాతం, పోలీసుల స్పందన బావుందని 59.5 శాతం, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని 56.3 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

రిజిస్ట్రేషన్‌లో స్లాట్ బుకింగ్ ప్రాసెస్‌పై 63.4 శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, అవినీతి లేదని 62.3 శాతం మంది చెప్పారన్నారు. ఇసుక రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌పై 70.6 శాతం, లభ్యతపై 67.5 శాతం, ధర పైన 61.1 శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, రెవెన్యూ ఎఫ్ లైన్‌పై ఎక్కువ డబ్బులు వసూళ్లు చేయడం లేదని 77.4 శాతం, పాస్‌బుక్ సర్వేలో ఎక్కువ మొత్తం తీసుకోలేదని 75.1 శాతం చెప్పారన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతోందని 61.6 శాతం, పంచాయతీ చెత్త సేకరణ జరుగుతోందని 56.7 శాతం, ఎన్టీఆర్ వైద్య సేవ అడ్మిషన్లపై 86.2 శాతం, సేవలపై 81.3 శాతం, ఆరోగ్య మిత్ర సాయంపై 82.4 శాతం మంది సంతృప్తి వ్యక్త చేయగా అవినీతి లేదని 78.5 శాతం తెలిపారన్నారు. 
Chandrababu Naidu
AP CM
Andhra Pradesh
Corruption
Governance
Public Opinion
Welfare Schemes
Job Creation
APSRTC
Ration Distribution

More Telugu News