Ahmedabad plane crash: విమానం కూలిన దృశ్యాన్ని వీడియో తీసిన బాలుడు ఏమన్నాడంటే..?

Aryan Witnessed Ahmedabad Plane Crash on Video
  • అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదాన్ని వీడియో తీసిన 12వ తరగతి విద్యార్థి
  • విమానం కూలిపోవడం కళ్లారా చూసి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఆర్యన్
  • భయంతో వణికిపోతున్న బాలుడు.. జన్మలో విమానం ఎక్కబోనని వెల్లడి
  • స్నేహితులకు పంపేందుకు తీసిన వీడియో దర్యాప్తులో కీలక ఆధారం
అహ్మదాబాద్‌ లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి వైరల్ గా మారిన వీడియోను రికార్డు చేసింది పదిహేడేళ్ల బాలుడు.. విమానం బాగా కిందినుంచి వెళుతుండడంతో స్నేహితులకు చూపించేందుకే తన ఫోన్ లో రికార్డు చేశానని సదరు బాలుడు ఆర్యన్ చెప్పాడు. అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని లక్ష్మీనగర్ లో ఆర్యన్ కుటుంబం ఉంటోంది. తక్కువ ఎత్తులో వెళ్తున్న విమానాలను వీడియో తీసి తన స్నేహితులకు పంపాలనుకున్నాడు. ఆ సమయంలోనే ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ 787-8 విమానం గాల్లో తూలుతూ, పెద్ద మంటలతో కూలిపోవడం అతడు రికార్డ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు ప్రమాద ఘటన దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది.

శనివారం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన ఆర్యన్, "ఇంత తక్కువ ఎత్తులో విమానాలు వెళ్లడం, వాటి పెద్ద శబ్దాలు నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు. మా ఊరిలో స్నేహితులకు చూపించాలని వీడియో తీశాను. కానీ అది ప్రమాద దృశ్యం అవుతుందని ఊహించలేదు. విమానం గాల్లో తూలడం, తర్వాత పెద్ద శబ్దంతో మంటల్లో చిక్కుకోవడం చూసి చాలా భయపడ్డాను" అని చెప్పాడు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆర్యన్ సరిగా నిద్రపోవడంలేదని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. తను చిత్రీకరించిన వీడియోలో 242 మంది ప్రయాణికుల చివరి క్షణాలున్నాయని తెలిసి మరింత కుంగిపోయాడు. పోలీసులు తనను విచారణకు పిలవడంతో కూడా భయపడ్డాడని వారు పేర్కొన్నారు. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆర్యన్ వాంగ్మూలం నమోదు చేసుకున్నామని, అతడిని నిర్బంధించలేదని, కేవలం వివరాలు మాత్రమే అడిగి తెలుసుకున్నామని స్పష్టం చేశారు.

ఒకప్పుడు విమానం ఎక్కాలని కలలు కన్న ఆర్యన్, ఇప్పుడు "జీవితంలో విమానం ఎక్కను" అంటున్నాడు. ఆర్యన్‌తో పాటు వీడియో తీసే సమయంలో ఉన్న అతని స్నేహితుడు రాజ్ సింగ్ మాట్లాడుతూ "ఆర్యన్ విమానాలు అంత దగ్గరగా వెళ్లడం చూసి ఆశ్చర్యపోయాడు. మంటలు చూడగానే భయంతో గదిలోకి పారిపోయాడు" అని తెలిపాడు. ఈ ఘటన తర్వాత లక్ష్మీనగర్ వాసులు కూడా భయాందోళన చెందుతున్నారు. రోజూ తమ ఇళ్లపై నుంచి వెళ్లే విమానాల శబ్దాలు ఇప్పుడు వారికి ఆందోళన కలిగిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. "సాధారణ స్థితికి రావడానికి కొన్ని రోజులు పడుతుంది" అని స్థానికులు అంటున్నారు.
Ahmedabad plane crash
Aryan
Air India Dreamliner
plane crash video
Lakshmi Nagar
Gujarat accident
viral video
aviation accident

More Telugu News