Chandrababu Naidu: రండి... మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Invites Participation in Yoga Andhra Program
  • ఈ నెల 21న విశాఖలో 'యోగాంధ్ర' కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రజలకు ఆహ్వానం
  • యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం పెంపు
  • కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు
విశాఖలో ఈ నెల 21న 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో 5 లక్షల మందితో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో స్పందించారు. 

"ప్రపంచానికి భారత దేశం ప్రసాదించిన దివ్య వరం… యోగ. ఆరోగ్యాన్నే కాకుండా ఆయుష్షును పెంచే యోగ మన జీవన విధానం కావాలి. ఈ నెల 21న విశాఖపట్నంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. రండి… మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. యోగాను జీవితంలో భాగం చేసుకుందాం… ఆరోగ్యంగా జీవిద్దాం" అని చంద్రబాబు పేర్కొన్నారు. 

"ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరం. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతగానో తోడ్పడుతుంది. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ యోగా దినోత్సవంలో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొంటున్నారు. రికార్డు స్థాయిలో నిర్వహించే ఈ వేడుకను విజయవంతం చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరుతున్నాను. యోగా వ్యాయామం మాత్రమే కాదు మన జీవన విధానం అని చాటిచెప్పండి" అని నారా లోకేశ్ వివరించారు.
Chandrababu Naidu
Yoga Andhra
Narendra Modi
Visakhapatnam
AP Government
Nara Lokesh
International Yoga Day
Yoga
Andhra Pradesh
World Yoga Day

More Telugu News