Suman: దేశంలో నెంబర్ వన్ సీఎం అంటే చంద్రబాబే: సుమన్

Suman Praises Chandrababu as Number One CM
  • సీఎం చంద్రబాబుపై సినీ నటుడు సుమన్ ప్రశంసలు
  • ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వమే కీలకం అని వెల్లడి
  • ఆయన అనుభవం, దార్శనికత రాష్ట్రానికి ఎంతో మేలు అని ఉద్ఘాటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రముఖ సినీ నటుడు సుమన్ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు తన అనుభవంతో, దార్శనికతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని, ఆయన దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని అభిప్రాయపడ్డారు. ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"చంద్రబాబు ఒక విజనరీ. ఎలాంటి సంక్షోభం వచ్చినా పరిష్కరించగలిగిన సమర్థుడు చంద్రబాబు. దేశంలోనే నెంబర్ వన్ సీఎం ఎవరంటే చంద్రబాబే. దెబ్బతిన్న రాష్ట్రాన్ని చక్కదిద్దాలంటే చంద్రబాబు వల్లే సాధ్యం... అందుకు ప్రజలు కూడా సహకరించాలి. ఆయనకు కొంత సమయం ఇవ్వాలి. ఏది ముందు చెయ్యాలి, ఏది తర్వాత చెయ్యాలి అనే ప్రాధాన్యతలు ఉంటాయి... మనకు కావాల్సింది ఇప్పుడే జరగాలి అంటే కుదరదు... అందుకోసం వేచిచూడాలి. 

చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. హైదరాబాద్ ను ఆయన అభివృద్ధి  చేసిన తీరు అందుకు నిదర్శనం. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ వచ్చారు... కాదనడంలేదు... కానీ హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్ పోర్టు వంటి నిర్మాణాలతో ఒక ఆర్కిటెక్చర్ మ్యాప్ ను ఏర్పాటు చేసింది మాత్రం చంద్రబాబే. ఇవాళ ఏపీ అభివృద్ధి అంటే ఒక పరీక్ష వంటిది. దాదాపు ఎడారి వంటి ప్రాంతాన్ని సుభిక్షంగా తయారుచేయాలంటే ఆయనకు సమయం ఇవ్వాలి... మనమందరం సహకరించాలి. 

మనుషులు అన్న తర్వాత తప్పులు ఉంటాయి.. ఎవరూ పర్ఫెక్ట్ కాదు.  అయితే ఆ తప్పు పెద్దదా, చిన్నదా అనేది చూడాలి. పెద్ద తప్పు అయితే మాట్లాడాలి, చిన్న తప్పు అయితే పట్టించుకోకూడదు. గత ప్రభుత్వం తప్పులు చేయలేదా? వాళ్లు కొన్ని మంచి పనులు చేశారు, కొంత చెడు కూడా జరిగింది. మనకు మోదీ గారి సహకారం ఉంది. ఆయన అండను వీలైనంతగా ఉపయోగించుకోవాలి" అని సుమన్ పేర్కొన్నారు.
Suman
Chandrababu Naidu
Andhra Pradesh
AP CM
Telugu Actor
AP Development
YS Rajasekhara Reddy
KCR
Narendra Modi
Political News

More Telugu News