AB de Villiers: ఆ జట్టులో విషపూరిత వ్యక్తులు ఉండేవాళ్లు: ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు

AB de Villiers Reveals Toxic Players in Delhi Daredevils Team
  • 2008లో ఢిల్లీతో ఐపీఎల్ ప్రస్థానం ప్రారంభించిన డివిలియర్స్
  • అప్పట్లో టీమ్‌లో మెక్‌గ్రాత్, వెటోరీ వంటి దిగ్గజాలున్నా ఇబ్బందులు
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే ఎక్కువ గుర్తింపు
  • ఢిల్లీ జట్టు అస్తవ్యస్తంగా ఉండేదని ఏబీడీ వెల్లడి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఒకరు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడి, ఎన్నో మ్యాచుల్లో అద్భుత ప్రదర్శనలతో అభిమానులను ఉర్రూతలూగించాడు. అయితే, ఏబీడీ తన ఐపీఎల్ ప్రస్థానాన్ని 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) జట్టుతో ప్రారంభించారు. బెంగళూరు జట్టులో వచ్చినంత పేరు అతడికి ఢిల్లీలో ఉన్నప్పుడు రాలేదు. దీని వెనుక గల కారణాలను తాజాగా డివిలియర్స్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

తాను ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడే సమయంలో జట్టులో "అనేకమంది విషపూరిత వ్యక్తులు" (పాయిజనస్ క్యారెక్టర్స్) ఉండేవారని ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్.కామ్‌కు ఇచ్చిన ఒక ముఖాముఖిలో ఈ విషయాలను పంచుకున్నాడు. అయితే, ఆ వ్యక్తుల పేర్లు చెప్పడానికి ఏబీ ఇష్టపడలేదు. "నేను ఎవరి పేర్లూ చెప్పి వారిని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. కానీ ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు అప్పట్లో అస్తవ్యస్తంగా ఉండేది. జట్టులో చాలా మంది విషపూరిత మనస్తత్వం గల వ్యక్తులు ఉండేవారు" అని తెలిపాడు.

ఆ సమయంలో జట్టులో గ్లెన్ మెక్‌గ్రాత్, డేనియల్ వెటోరీ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, కొంతమంది వ్యక్తుల ప్రవర్తన వల్ల ఆ అనుభవం కొంత దెబ్బతిన్నదని ఏబీ డివిలియర్స్ వాపోయాడు. "నాకు అది తీపి, చేదు అనుభవాల కలయిక. ఎందుకంటే నా జీవితంలో, కెరీర్‌లో కొన్ని మధురమైన క్షణాలు అక్కడే ఉన్నాయి. గ్లెన్ మెక్‌గ్రాత్, డేనియల్ వెటోరీలతో సమయం గడపడం గొప్ప విషయం. వారితో నేను సన్నిహితమయ్యాను" అని ఏబీడీ పేర్కొన్నాడు.

చిన్నప్పటి నుంచి తాను ఎంతగానో ఆరాధించిన మెక్‌గ్రాత్ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడటంపై కూడా డివిలియర్స్ స్పందించాడు. "మెక్‌గ్రాత్ వంటి వారు నాకు హీరోలు. వారిని చూస్తే మొదట్లో భయపడేవాడిని. 2006లో ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఆయనకు వ్యతిరేకంగా ఆడినప్పుడు నేను ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేకపోయాను, ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. అలాంటిది, 2008లో ఐపీఎల్‌లో ఆయన నా పక్కన కూర్చుని, 'నువ్వు ఆడే విధానం నాకు నచ్చింది' అన్నారు. అప్పుడు నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు" అంటూ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తర్వాత, ఏబీ డివిలియర్స్ 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరాక కెరీర్ అద్భుతంగా సాగింది. ఏబీడీ బెంగళూరు తరఫున పదేళ్లపాటు ఆడాడు. 
AB de Villiers
AB de Villiers IPL
Delhi Daredevils
Royal Challengers Bangalore
RCB
Glenn McGrath
Daniel Vettori
IPL Toxic Players
South Africa Cricket

More Telugu News