Intel: ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన మరో దిగ్గజ టెక్ కంపెనీ

Intel to Implement Major Layoffs at Tech Company
  • ఉద్యోగుల తగ్గింపునకు చర్యలు చేపడుతున్న ఐటీ దిగ్గజ కంపెనీలు
  • ఆదే బాటలో చర్యలు చేపడుతున్న ఇంటెల్ కంపెనీ
  • అంతర్గతంగా ఉద్యోగులకు కంపెనీ మెమోలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియాల్లో వార్తలు 
పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కంప్యూటర్లు తయారు చేసే ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కూడా అదే బాటలో పయనిస్తోంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సదరు కంపెనీ సిద్ధమైంది. ఈ పరిణామాలు వివిధ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

తన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకునేందుకు ఇంటెల్ చర్యలు చేపట్టింది. వచ్చే జులై మధ్యలో తొలగింపుల ప్రక్రియ ప్రారంభించి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇంటెల్ కంపెనీకి నూతన సీఈవో లిప్ బు టాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది తొలి భారీ ఉద్యోగాల కోత అవ్వనుంది.

ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన విషయాన్ని నేరుగా ఇంటెల్ ప్రకటించలేదు. కానీ, ఆ మేరకు కంపెనీ ఉద్యోగులకు అంతర్గతంగా మెమోల ద్వారా తెలియజేసినట్లు పలు అంతర్జాతీయ వార్తా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.

కంపెనీ తన అంతర్గత తయారీ విభాగమైన ఇంటెల్ ఫౌండ్రీలో కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకుని, మరింత చురుకైన సంస్థగా రూపాంతరం చెందాలన్న లక్ష్యం పెట్టుకుందని, అందులో భాగంగానే ఈ ఉద్యోగ తగ్గింపు చర్యలు చేపడుతోందని పేర్కొన్నాయి. కంపెనీ చేపడుతున్న ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఎంతమందిపై ప్రభావం పడుతుందనే విషయం ఇంకా వెల్లడి కాలేదు.

పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ మార్కెట్‌లో డిమాండ్ పడిపోవడం, విక్రయాలు క్షీణించడం, మరోవైపు ఎన్ విడియా, ఏఎండీ వంటి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ నేపథ్యంలో ముఖ్యంగా ఏఐ ఫోకస్డ్ హార్డ్‌వేర్‌లో ఉద్యోగ పునర్నిర్మాణంపై ఇంటెల్ దృష్టి పెట్టినట్లుగా భావిస్తున్నారు. 
Intel
Intel layoffs
Tech company layoffs
Lip-Bu Tan
Job cuts
IT industry
Intel Foundry
Nvidia
AMD
Technology sector

More Telugu News