Tamil Nadu: టూరిస్టుల నుంచి రూ. 500నోట్ల కట్ట లాక్కెళ్లిన కోతి.. ఆ త‌ర్వాత ఏం చేసిందంటే.!

Monkey Steals Money From Tourists in Kodaikanal
  • కొడైకెనాల్‌లోని గుణ గుహ వ‌ద్ద ఘ‌ట‌న‌
  • నోట్లతో ఆడుకుంటూ, గాల్లోకి విసిరేస్తూ కోతి హల్‌చల్
  • ఈ ఘటనతో టూరిస్టులు షాక్
  • గతంలో మధ్యప్రదేశ్‌లోనూ ఇదే తరహా ఘటన
  • కోతులకు ఆహారం ఇవ్వొద్దని వన్యప్రాణి నిపుణుల హెచ్చరిక
తమిళనాడులోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కొడైకెనాల్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పర్యటకుల నుంచి ఓ కోతి ఏకంగా రూ. 500 నోట్ల కట్టను లాక్కెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న టూరిస్టులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే... కొడైకెనాల్‌లోని గుణ గుహ‌ సందర్శన‌కు వచ్చిన క‌ర్ణాట‌కకు చెందిన‌ కొందరు పర్యటకుల చేతిలో ఉన్న రూ. 500 నోట్ల కట్టను ఓ కోతి అమాంతం లాగేసుకుంది. అంతటితో ఆగకుండా ఆ నోట్లతో చెట్టు ఎక్కి ఆడుకోవడం మొద‌లుపెట్టింది. వాటిని గాల్లోకి విసిరేయడం చేసింది. ఈ దృశ్యాల‌ను అక్క‌డ ఉన్న‌వారు త‌మ మొబైల్ ఫోన్ల‌లో వీడియో తీసి, సోష‌ల్ మీడియాలో పెట్టారు. దాంతో వీడియో వైర‌ల్‌గా మారింది. 

ఇలాంటి ఘటనలు మన దేశంలో కొత్తేమీ కాదు. గతంలో మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే తరహాలో ఓ సంఘటన జరిగింది. అక్కడ ఓ ఆటో ప్రయాణికుడి నుంచి ఏకంగా లక్ష రూపాయల నగదును ఓ కోతి లాక్కెళ్లింది. ఆ తర్వాత ఓ చెట్టెక్కి నోట్లను కిందకు విసిరేయడంతో వాటిని ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు. 

సాధారణంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు కోతులు ఎక్కువగా ఆకర్షితులవుతుంటాయి. పర్యటకులు, స్థానికులు వాటికి ఆహారం అందించడం వల్ల అవి మనుషులకు బాగా అలవాటుపడి, వారి నుంచి వస్తువులు లాక్కోవడానికి కూడా వెనుకాడటం లేదని వన్యప్రాణి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

కోతులకు ఆహారం పెట్టడం, వాటిని మనుషులకు మరీ దగ్గరగా రానివ్వడం వంటి చర్యల వల్లే ఇలాంటి సమస్యాత్మక ప్రవర్తన వాటిలో పెరుగుతోందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారు తమ వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 
Tamil Nadu
Kodaikanal Monkey
Kodaikanal
Tamil Nadu Tourism
Monkey Steals Money
Tourist Incident
Guna Cave
Karnataka Tourists
Viral Video
Wildlife Experts

More Telugu News