Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం: లభ్యమైన రెండు బ్లాక్ బాక్స్‌లు.. దర్యాప్తులో కీలక పురోగతి

Ahmedabad Plane Crash Two Black Boxes Recovered Key Progress in Investigation
  • కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్‌డీఆర్) స్వాధీనం
  • ప్రమాద కారణాల గుర్తింపునకు ఇవి అత్యంత కీలకమన్న దర్యాప్తు అధికారులు
  • 270 మంది మృతి చెందిన ఘటనపై ఏఏఐబీ, ఎన్‌టీఎస్‌బీ దర్యాప్తు ముమ్మరం
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. ప్రమాదానికి గురైన విమానానికి చెందిన రెండు బ్లాక్ బాక్స్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాద కారణాలను వెలికితీయడంలో ఈ బ్లాక్ బాక్స్‌లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు నిన్న కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) లభ్యమైనట్టు చెప్పారు. అంతకుముందు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) అధికారులు విమానానికి చెందిన ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్‌డీఆర్) మాత్రమే దొరికినట్టు వెల్లడించారు. తాజా పరిణామంతో, రెండు కీలకమైన బ్లాక్ బాక్స్‌లు (ఎఫ్‌డీఆర్, సీవీఆర్) దర్యాప్తు బృందాలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు పరికరాల ద్వారా విమానం కూలిపోవడానికి గల కారణాలను సులభంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా నిన్న అహ్మదాబాద్‌లోని విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరు, తక్షణ సహాయక చర్యల గురించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఏఏఐబీ, ఏఏఐ అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం సివిల్ ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను కలిసి, డీఎన్‌ఏ నమూనాల సేకరణ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ ప్రక్రియను సాఫీగా, వేగంగా పూర్తిచేయాలని, బాధితులకు అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిని కూడా పరామర్శించి, వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి వర్గాలకు సూచించారు. 
Ahmedabad Plane Crash
Air India
Black Box
Flight Data Recorder
Cockpit Voice Recorder
Aircraft Accident Investigation Bureau
PK Mishra
Narendra Modi
Ahmedabad

More Telugu News