KTR: ఫార్ములా-ఈ రేస్ కేసు.. మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్

KTR to Attend ACB Inquiry in Formula E Race Case
  • 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్
  •  విచారణకు ముందు తండ్రి కేసీఆర్‌తో భేటీ  
  • తెలంగాణ భవన్, కేటీఆర్ నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు
  •  ప్రతీకార చర్యలకు భయపడనని, పోరాటం కొనసాగిస్తానన్న కేటీఆర్
రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైన ఫార్ములా- ఈ కార్ రేసు నిర్వహణ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు నేడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల సమయంలో ఆయన హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లనున్నారు.

ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయినట్టు తెలిసింది. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో కేసీఆర్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో పలు కీలక అంశాలపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మరోవైపు, కేటీఆర్‌కు మద్దతు తెలిపేందుకు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆయన నివాసానికి తరలివచ్చారు. వీరిలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్, పటోళ్ల కార్తీక్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే, తెలంగాణ భవన్‌కు కూడా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు.

ఏసీబీ కార్యాలయం వద్ద భారీ బందోబస్టు
కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు తెలంగాణ భవన్ వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే ఉంటానని, ఇలాంటి విచారణలకు నిరుత్సాహపడనని స్పష్టం చేశారు. "మీ విచారణలు, కమిషన్లు, రాజకీయ ప్రతీకార చర్యలకు నేను ఎప్పటికీ నిరుత్సాహపడను. 420 వాగ్దానాలు, మోసపూరిత డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల అమల్లో వైఫల్యాలను ఎత్తిచూపుతూనే ఉంటాం" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 
KTR
K T Rama Rao
Formula E Race
ACB Investigation
Telangana
BRS Party
KCR
Telangana Bhavan
Corruption Case

More Telugu News