Ali Khamenei: ఇజ్రాయెల్ భారీ దాడులు... ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ బంకర్ లోకి తరలింపు

Ali Khamenei Moved to Bunker Amid Israel Attacks
  • ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో బంకర్ కు ఖమేనీ తరలింపు
  • టెహ్రాన్‌లోని కీలక ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
  • ఖమేనీ నివాసం దగ్గర పేలుళ్లతో అప్రమత్తమైన ఇరాన్ అధికారులు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అధికారులు అత్యంత రహస్యంగా ఒక సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్‌లోని అనేక కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయని సమాచారం.

గత శుక్రవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఖమేనీ నివాసం ఉన్న ప్రాంతంతో పాటు, ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మోనిరియే ప్రాంతం కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఖమేనీ నివాసానికి అతి సమీపంలో ఈ పేలుళ్లు సంభవించాయని టెహ్రాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన భద్రతపై ఆందోళన చెందిన అధికారులు, ఖమేనీని, ఆయన కుటుంబాన్ని ఈశాన్య టెహ్రాన్‌లోని లావిజాన్‌లో ఉన్న ఒక అండర్‌గ్రౌండ్ బంకర్‌కు తరలించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఖమేనీ కుటుంబాన్ని బంకర్‌కు తరలించిన సందర్భాలున్నాయని పేర్కొంటున్నారు.

'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇజ్రాయెల్ చేపట్టిన ఈ దాడుల తొలి దశలోనే ఖమేనీని లక్ష్యంగా చేసుకోవాలని తొలుత భావించినట్లు సమాచారం. అయితే, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నెతన్యాహు ప్రభుత్వం, కేవలం హెచ్చరికగా మాత్రమే ఖమేనీ నివాసం సమీపంలో దాడులు జరిపినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

గత నాలుగు రోజులుగా ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ భీకర దాడుల వల్ల ఇరాన్ వైపు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కీలక సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తలు ఈ దాడుల్లో మరణించినట్లు సమాచారం. ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాఘేరి, రెవల్యూషనరీ గార్డ్స్ అధిపతి మేజర్ జనరల్ హొస్సేన్ సలామీతో పాటు ఆ విభాగపు ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా మృతిచెందిన వారిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇరాన్ సైనిక సామర్థ్యానికి పెద్ద దెబ్బ అని నిపుణులు భావిస్తున్నారు.
Ali Khamenei
Iran
Israel
Khamenei bunker
Israel Iran conflict
Tehran
Netanyahu
Operation Rising Lion
Iran nuclear program
Middle East tensions

More Telugu News