Varanasi: వారణాసి రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ దోపిడీ.. బైక్‌ పార్కింగ్‌కు రోజుకు రూ.2,400

Railway cancels Varanasi station parking contract over excess fee collection and FIR against contractor
  • వారణాసి రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ కాంట్రాక్టర్ల ఆగడాలు
  • 24 గంటల బైక్ పార్కింగ్‌కు ఏకంగా రూ. 2,400 డిమాండ్
  • గంటకు బైక్‌కు రూ. 100..సైకిల్‌కు రూ. 50 చొప్పున అక్రమ వసూళ్లు
  • ప్రయాణికుల తీవ్ర ఆగ్రహం.. మీడియా కథనాలతో వెలుగులోకి వ్యవహారం
  • స్పందించిన రైల్వే అధికారులు.. పార్కింగ్ కాంట్రాక్ట్ రద్దు
వారణాసి రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ కాంట్రాక్టర్లు ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, సైకిళ్ల పార్కింగ్ కోసం నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై రైల్వే అధికారులు తక్షణమే స్పందించి, సంబంధిత పార్కింగ్ ఏజెన్సీ కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... వారణాసి రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న పార్కింగ్ స్టాండ్‌లో నిబంధనలకు పాతరేసి, ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపించారు. ఒక బైక్‌ను 24 గంటల పాటు పార్క్ చేయడానికి ఏకంగా రూ. 2,400 డిమాండ్ చేసిన‌ట్లు తెలిపారు. అంటే గంటకు రూ. 100 చొప్పున డిమాండ్ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. 

ఇక, సైకిల్ పార్కింగ్‌కు కూడా గంటకు రూ. 50 వసూలు చేస్తున్నట్లు పలు వార్తా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ఈ వార్తలు ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన కలిగించాయి. ఇది పక్కా దోపిడీ అని, అన్యాయమని వారు మండిపడ్డారు.

వాస్తవానికి భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం 24 గంటల బైక్ పార్కింగ్‌కు సాధారణంగా రూ. 10 నుంచి రూ. 250 మధ్య ఛార్జ్ చేయాలి. అలాగే 12 గంటల సైకిల్ పార్కింగ్‌కు రూ. 5 నుంచి రూ. 10 మించి వసూలు చేయకూడదు. కానీ, వారణాసి స్టేషన్‌లో వసూలు చేస్తున్న ఛార్జీలు వీటికి పూర్తి విరుద్ధంగా ఉండటంతో ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

రైల్వే శాఖ చర్యలు
ప్రయాణికుల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు, మీడియా కథనాల నేపథ్యంలో రైల్వే ఉన్నతాధికారులు వెంటనే అంతర్గత విచారణకు ఆదేశించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో స్టేషన్ ప్రధాన ప్లాట్‌ఫామ్‌ సమీపంలోని పార్కింగ్ స్టాండ్ నిర్వహిస్తున్న ఏజెన్సీ కాంట్రాక్ట్‌ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఆదివారం రైల్వే అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 

అంతేకాకుండా, నిబంధనలకు విరుద్ధంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన కాంట్రాక్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నియంత్రిత, సరసమైన పార్కింగ్ ఛార్జీలను పునరుద్ధరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
Varanasi
Varanasi Railway Station
railway parking
parking scam
bike parking fee
cycle parking fee
railway contract cancelled
Indian Railways
parking contractor FIR
overcharging

More Telugu News