Microplastics: మైక్రో ప్లాస్టిక్ కణాలతో పురుషుల్లో సంతానలేమి..!

Microplastics Found in Testicles Linked to Infertility
  • ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఆరుగురిలో ఒకరికి ఈ సమస్య
  • మానవ వృషణాల్లో కుక్కల కంటే మూడు రెట్లు అధికంగా ప్లాస్టిక్
  • ఆహారం, నీరు, గాలి ద్వారా శరీరంలోకి ప్లాస్టిక్ కణాలు
ప్రపంచవ్యాప్తంగా అనేక జంటలను వేధిస్తున్న సంతానలేమి సమస్యకు మరో కొత్త కారణం వెలుగులోకి వచ్చింది. ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుండగా, తాజాగా పురుషుల వృషణాల్లో మైక్రోప్లాస్టిక్స్ చేరడం సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఇటీవలి అధ్యయనం తేల్చింది.

న్యూ మెక్సికో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 23 మంది పురుషులు, 47 కుక్కల వృషణాల నుంచి కణజాలాలను సేకరించి విశ్లేషించారు. ఈ పరిశోధనలో అన్ని నమూనాల్లోనూ మైక్రోప్లాస్టిక్ కాలుష్యం ఉన్నట్లు గుర్తించారు. కుక్కల వృషణ కణజాలంతో పోలిస్తే, మానవ వృషణాల్లోనే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా (ఒక గ్రాము కణజాలానికి సగటున 329.44 మైక్రోగ్రాములు) మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు కనుగొన్నారు.

ప్యాకేజింగ్ వస్తువులు, ఆహార పదార్థాలు, పైపులు, ఇతర రోజువారీ వస్తువులలో వాడే పాలిథీన్, పాలీవినైల్ క్లోరైడ్ వంటి సాధారణ ప్లాస్టిక్‌లు ఈ కణజాల నమూనాలలో కనిపించాయి. ఈ మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి లోతుగా చొచ్చుకుపోయి పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల కణజాలంలో పాలీవినైల్ క్లోరైడ్ అధికంగా ఉండటం, వాటిలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటాన్ని గమనించారు. మైక్రోప్లాస్టిక్‌లు ఎండోక్రైన్ వ్యవస్థకు అంతరాయం కలిగించడం వల్లే ఇలా జరుగుతోందని పరిశోధకులు పేర్కొన్నారు.

మనుషులతో సమానమైన వాతావరణంలో జీవించే కుక్కలలో కనిపించిన ఈ ప్రభావం మానవులలో కూడా దాదాపు అదేవిధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆహారం, నీరు, గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించే ఈ మైక్రోప్లాస్టిక్‌లు రక్తం, ఊపిరితిత్తులు, మాయ (ప్లాసెంటా), మెదడు వంటి ఇతర అవయవాల్లో కూడా ఉన్నట్లు గతంలో గుర్తించారు. ఈ 'అదృశ్య ముప్పు' సంతానోత్పత్తి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, వృషణాల్లో చేరుతున్న మైక్రోప్లాస్టిక్స్ సంతానలేమికి ఎలా దారితీస్తున్నాయనే విషయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం ఎంతగా ఉందనేది తెలియాలంటే మరికొంత అధ్యయనం చేయాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
Microplastics
Male infertility
Infertility
Testicles
Sperm count
Polyvinyl chloride
Semen quality
Plastic pollution
Microplastic effects
Human health

More Telugu News