Karun Nair: ఆ ప్రముఖ క్రికెటర్ చెప్పిన మాట వినుంటే... కరుణ్ నాయర్ కెరీర్ ముగిసేదేమో!

Karun Nair set to prove his talent despite an advice from star cricketer to retire
  • ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్
  • రెండేళ్ల క్రితం రిటైర్మెంట్ తీసుకోమన్న ప్రముఖ క్రికెటర్
  • ఆర్థిక భరోసా కోసం టీ20 లీగ్‌లు ఆడమని సలహా
  • అయితే, పట్టువదలకుండా దేశవాళీలో సత్తా చాటిన కరుణ్
  • ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక
  • ఇంగ్లండ్ లయన్స్‌పై డబుల్ సెంచరీతో ఫామ్ నిరూపణ
సూపర్ ఫామ్‌లో ఉన్న కర్ణాటకకు చెందిన బ్యాటర్ కరుణ్ నాయర్ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం ఓ ప్రముఖ క్రికెటర్ ఇచ్చిన సలహాను గనక అతను పాటించి ఉంటే, ఇప్పుడు ఇలా భారత టెస్టు జట్టులో సభ్యుడై ఉండేవాడు కాదేమో. ఆ క్రికెటర్ మాటలు పట్టించుకోకుండా, పట్టుదలతో శ్రమించి మళ్లీ జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు కరుణ్.

దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరుణ్ నాయర్ టీమిండియా టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రెండేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. "నాకు ఇప్పటికీ గుర్తుంది. ఓ ప్రముఖ భారత క్రికెటర్‌ రెండేళ్ల క్రితం నాకు ఫోన్‌ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకుని, ఆర్థికంగా భరోసా ఇచ్చే విదేశీ టీ20 లీగ్‌లలో ఆడుకోమని సూచించాడు. అతడు చెప్పినట్లు చేయడం చాలా సులువే. కానీ, నా లక్ష్యం తిరిగి భారత జట్టుకు ఆడటమే. ఆ సంఘటన జరిగి రెండేళ్లు గడిచాయి. ఇప్పుడు నేను మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాను" అని కరుణ్ నాయర్ ఆ ఇంటర్వ్యూలో వివరించారు.

జూన్‌ 20 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న అయిదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన 18 మంది సభ్యుల బృందంలో కరుణ్ నాయర్‌కు స్థానం లభించింది. ప్రస్తుతం అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌ లయన్స్‌తో ఇండియా ఏ జట్టు తలపడిన అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో సత్తా చాటాడు.

కరుణ్ నాయర్ 2023, 2024 కౌంటీ ఛాంపియన్‌షిప్ సీజన్లలో నార్తాంప్టన్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడ 10 మ్యాచ్‌ల్లో ఓ చిరస్మరణీయమైన డబుల్ సెంచరీతో సహా 736 పరుగులు చేశాడు. ఇక 2024-25 రంజీ ట్రోఫీలో విదర్భకు ఆడుతూ 16 ఇన్నింగ్స్‌ల్లో 863 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలున్నాయి. విజయ్‌ హజారే ట్రోఫీలో ఎనిమిది ఇన్నింగ్స్‌లో ఏకంగా 779 పరుగులు చేయగా, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2024-25 టీ20 టోర్నీలో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 255 పరుగులు చేసి నిలకడైన ప్రదర్శన కనబరిచాడు.
Karun Nair
Team India
England Tour

More Telugu News