US Embassy: ఇజ్రాయెల్ లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకిన ఇరాన్ క్షిపణి... పరిస్థితి మరింత ఉద్రిక్తం

Iran missile touches US embassy in Israe
  • ఈ ఉదయం క్షిపణిని ప్రయోగించిన ఇరాన్
  • ఈ దాడిలో స్వల్పంగా దెబ్బతిన్న అమెరికా దౌత్య కార్యాలయం
  • ఇరాన్ మూల్యం చెల్లిస్తుందన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి.  ఈ ఉదయం ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్ అవీవ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త వాతావరణం మరింత వేడెక్కింది.

ఇరాన్ క్షిపణి దాడిలో తమ దౌత్య కార్యాలయ భవనం స్వల్పంగా దెబ్బతిన్నట్లు అమెరికా దౌత్యవేత్త మైక్‌ హకేబీ ధృవీకరించారు. అయితే, ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఆయన స్పష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా టెల్ అవీవ్‌, జెరూసలంలోని అమెరికా దౌత్య కార్యాలయాలను మూసివేస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా ఆయన ప్రకటించారు.

కాగా, తమ పౌరులపై ఇరాన్ చేస్తున్న దాడులకు టెహ్రాన్‌ నగర ప్రజలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఖట్జ్‌ తీవ్రంగా హెచ్చరించారు. గత రాత్రి ఇరాన్ జరిపిన దాడిలో ఐదుగురు పౌరులు మరణించారని, డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారని ఆయన తెలిపారు. ఇరాన్‌ సుప్రీంనేత ఖమేనీని ఉద్దేశిస్తూ ఖట్జ్‌ తన టెలిగ్రామ్‌ ఛానెల్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "గర్వంతో విర్రవీగుతున్న ఆ నియంత ఇప్పుడు హంతకుడిగా మారాడు. మా సైన్యాన్ని భయపెట్టి, ఆపరేషన్‌ను ఆపేయాలనే దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మా పౌరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నాడు. దీనికి టెహ్రాన్‌వాసులు అతి త్వరలోనే భారీ మూల్యం చెల్లించక తప్పదు" అని ఆయన హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్‌లోని ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు తక్షణమే ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ 'ఎక్స్‌'లో సూచించింది.
US Embassy
Israel
Iran

More Telugu News