Women's World Cup: మహిళల వరల్డ్ కప్ లో భార‌త్ వ‌ర్సెస్ పాకిస్థాన్.. దాయాదులు త‌ల‌ప‌డేది ఎక్క‌డ‌, ఎప్పుడంటే..?

India and Pakistan clash in Womens World Cup
  • మహిళల వన్డే ప్రపంచ కప్‌కు ఈ ఏడాది భార‌త్‌ ఆతిథ్యం
  • సెప్టెంబర్ 30 నుంచి టోర్నీ ప్రారంభం.. నవంబర్ 2న ఫైనల్
  • ఈ ఐసీసీ టోర్నీలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా దాయాదుల పోరు
  • అక్టోబర్ 5న కొలంబో వేదిక‌గా ఈ హై-వోల్టేజ్ మ్యాచ్
పుష్క‌ర కాలం త‌ర్వాత‌ భారత్‌ మహిళల వన్డే ప్రపంచ కప్‌కు ఈ ఏడాది మనదేశం ఆతిథ్యం ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది. భారత్‌ చివరిసారిగా ఈ ఈవెంట్‌కు 2013లో ఆతిథ్యం ఇచ్చింది. ఇక‌, ఇండియా ఆతిథ్యం ఇస్తున్న ఈ ఐసీసీ టోర్నీలో దాయాదుల పోరు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. 

దీంతో ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎక్క‌డ జ‌రుగుతుంది అని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌ క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఐసీసీ ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జ‌రిగే వేదిక‌, తేదీని ప్ర‌క‌టించింది. అక్టోబర్ 5న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో దాయాదుల పోరు జరగనుంది. కాగా, బీసీసీఐ, పీసీబీ మధ్య హైబ్రిడ్ హోస్టింగ్ ఒప్పందంలో భాగంగా పాక్‌ తన అన్ని మ్యాచ్‌లను కొలంబోలో ఆడుతుంది. 

భార‌త్ ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా.. 
భార‌త్ త‌న తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 30న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో ఆడ‌నుంది. ఆ త‌ర్వాత అక్టోబర్ 5న కొలంబో వేదిక‌గా పాక్‌తో ఆడుతుంది. అనంత‌రం అక్టోబ‌ర్‌ 9న విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా అక్టోబర్ 12న ఇదే వేదికలో ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 19న ఇండోర్‌లో ఇంగ్లాండ్‌తో, అక్టోబర్ 23న గౌహతిలో న్యూజిలాండ్‌తో, అక్టోబర్ 26న బంగ్లాదేశ్‌తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో లీగ్ స్టేజీని ముగించనుంది. 

టోర్నమెంట్ ఫార్మాట్, వేదికలు
బెంగళూరు, ఇండోర్, గువహతి, విశాఖపట్నం, కొలంబో ఈ ఐదు వేదికలలో మొత్తం 28 లీగ్ మ్యాచ్‌లు, మూడు నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈసారి కూడా 2022లో లానే రౌండ్-రాబిన్ విధానంలోనే టోర్నీ జ‌రుగుతుంది. లీగ్ ద‌శ‌లో ఎనిమిది జట్లు ఒకదానితో ఒకటి ఒకసారి ఆడతాయి. అందులో టాప్‌-4 జట్లు సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

మొదటి సెమీ-ఫైనల్: అక్టోబర్ 29 (గువహతి లేదా కొలంబో)
రెండో సెమీ-ఫైనల్: అక్టోబర్ 30 (బెంగళూరు)
ఫైనల్: నవంబర్ 2 (బెంగళూరు లేదా కొలంబో)


ఈసారి టోర్నీకి అర్హత సాధించిన ఎనిమిది జట్లు: భారత్‌ (ఆతిథ్య దేశం), ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్.
Women's World Cup
India
Pakistan
ICC

More Telugu News