Bengaluru: బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో

Bengaluru Rapido Driver Slaps Woman
  • రాపిడో బైక్ ట్యాక్సీ బుక్ చేసుకున్న యువతి
  • డ్రైవింగ్ నిర్లక్ష్యంగా ఉందంటూ మధ్యలోనే బైక్ దిగిన యువతి
  • ఇరువురి మధ్య వాగ్వాదం
  • భాష అర్థం కాకపోవడంతో ముదిరిన గొడవ, ప్రయాణికురాలిపై దాడి
బెంగళూరు నగరంలో ఒర దారుణ సంఘటన చోటుచేసుకుంది. రాపిడో బైక్ ట్యాక్సీ రైడర్ ఒకరు మహిళా ప్రయాణికురాలిపై దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. జయనగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన, నగరంలో మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది.

ఒక నగల దుకాణంలో పనిచేసే యువతి రాపిడో బైక్ ట్యాక్సీని బుక్ చేసుకుంది. అయితే రైడర్ నిర్లక్ష్యంగా, వేగంగా వాహనం నడుపుతుండటంతో ఆమె భయాందోళనకు గురైంది. దీంతో ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసి బైక్ దిగిపోయింది. ఈ క్రమంలో రైడర్ తీరును ఆమె ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.

సదరు యువతి ఇంగ్లీషులో మాట్లాడుతుండగా రైడర్ కేవలం కన్నడలోనే సమాధానం చెప్పడంతో ఒకరి మాటలు ఒకరికి అర్థం కాలేదు. ప్రయాణ ఛార్జీ చెల్లించేందుకు, హెల్మెట్ తిరిగి ఇచ్చేందుకు మహిళ నిరాకరించిందని సమాచారం. ఈ క్రమంలో సహనం కోల్పోయిన రైడర్ ఆమెపై చేయి చేసుకున్నాడు. ఈ దాడిలో మహిళ కిందపడిపోయింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరూ తీవ్రంగా వాగ్వాదానికి దిగడం, చుట్టూ ఉన్నవారిని కలుగజేసుకోవాలని కోరడం కనిపిస్తోంది. అయితే అక్కడున్నవారు ఎవరూ వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. రైడర్ మహిళను కొట్టిన తర్వాత కూడా ఎవరూ జోక్యం చేసుకోకపోవడం గమనార్హం.

ఈ ఘటనపై పోలీసు వర్గాలు స్పందించాయి. బాధితురాలిని సంప్రదించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరినప్పటికీ ఆమె అందుకు సుముఖత చూపలేదని తెలిసింది. దీంతో పోలీసులు నాన్-కాగ్నిజబుల్ రిపోర్ట్ (ఎన్.సి.ఆర్.) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Bengaluru
Rapido
Karnataka

More Telugu News