Plane Crash: విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

New Video Shows Lone Survivor Of Burning Air India Crash Site
  • అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేశ్
  • కాలిపోతున్న విమానం నుంచి నడిచొస్తున్న వీడియో తాజాగా విడుదల
  • చేతిలో మొబైల్ ఫోన్‌తో బయటకు వచ్చిన దృశ్యాలు
  • శరీరంపై గాయాలు ఉండటంతో ఆసుపత్రికి తరలించిన స్థానికులు
అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేశ్ ప్రాణాలతో బయటపడిన ఘటనకు సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విమానం మంటల్లో కాలిపోతుండగా, దట్టమైన పొగలు కమ్ముకున్న ప్రాంతం నుంచి ఆయన చేతిలో మొబైల్ ఫోన్‌తో నడుచుకుంటూ రావడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన 32 సెకన్లకే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమాన సిబ్బంది, పైలట్లు, ప్రయాణికులు, హాస్టల్ భవనంలోని విద్యార్థులు సహా 274 మంది మృతి చెందారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మృతుల్లో ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి విశ్వాస్‌ కుమార్‌ రమేశ్‌ (40) ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో, తెలుపు రంగు టీషర్ట్ ధరించిన విశ్వాస్ కుమార్, ప్రమాద స్థలం నుంచి రోడ్డు పైకి నడుచుకుంటూ వస్తుండగా స్థానికులు గమనించారు. ఆయన శరీరంపై గాయాలు ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అలా నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేశ్ అని గుర్తించారు.

విమానంలో 11-ఏ సీటులో, ఎమర్జెన్సీ డోర్ పక్కన కూర్చున్నానని, విమానం కూలినప్పుడు తన సీటు విరిగి కిందపడిందని, దీంతో మంటలు అంటుకోలేదని విశ్వాస్ తెలిపారు.

"చనిపోతాననుకున్నాను. కళ్లు తెరిచి చూస్తే బతికే ఉన్నాను. సీట్ బెల్ట్ తీసి బయటకు వచ్చాను. ఎయిర్‌హోస్టెస్, ఇతరులు నా కళ్ల ముందే చనిపోయారు" అని ఆయన ఒక ఇంటర్వ్యూలో వివరించారు. శిథిలాల నుంచి మెల్లగా నడుచుకుంటూ బయటకు వచ్చానని చెప్పారు. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే విమానంలో ఏదో సమస్య తలెత్తినట్లు అనిపించిందని, ఆకుపచ్చ, తెలుపు లైట్లు వెలిగాయని, పైలట్లు విమానాన్ని పైకి లేపడానికి ప్రయత్నించినా అది వేగంగా వెళ్లి భవనాన్ని ఢీకొట్టిందని ఆయన ఆనాటి భయానక క్షణాలను గుర్తుచేసుకున్నారు.
Plane Crash
Air India Crash
Ahmedabad Plane crash
Gujarat
Air India

More Telugu News