K Kavitha: కేటీఆర్ కు మద్దతుగా నిలిచిన కవిత

Kavitha on KTR ACB questioning
  • కేటీఆర్‌ పై ఏసీబీ విచారణ నేపథ్యంలో కవిత మద్దతు
  • ప్రధాన సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే విచారణలంటూ ఆరోపణ
  • తమ పార్టీ నేతలు, కార్యకర్తలను అడ్డుకుంటున్నారని మండిపాటు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆయన సోదరి, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతుగా నిలిచారు. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ చేపట్టిన విచారణ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ విచారణ జరుగుతోందని, ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.

"ఏ పార్టీలోనైనా లోపాలుంటే అధినేత దృష్టికి తీసుకెళ్లడం సహజం. అంతమాత్రానికే దాన్ని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. మా పార్టీలోని లోపాలను మేం సరిదిద్దుకుంటాం. మాపై ఎవరైనా దాడి చేస్తే ఊరుకోబోం" అని స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను, నేతలను బయటకు రాకుండా అడ్డుకోవడం దారుణమని ఆమె మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాను కేవలం ఒకసారే, అదీ 60 శాతం మంది రైతులకే అందించిందని కవిత విమర్శించారు. "మిగిలిన 40 శాతం మంది రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలి. గత యాసంగిలో ఇచ్చినట్టు మూడు ఎకరాల లోపు భూమి ఉన్నవారికే ఇస్తారా, లేక రైతులందరికీ వర్తింపజేస్తారా అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడింది" అని ఆమె మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. 
K Kavitha
KTR
BRS

More Telugu News