Iran: ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు.. ఇరాన్ సంచలన ప్రకటన

Iran mulls bill to quit Treaty on the Non Proliferation of Nuclear Weapons
  • అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి తప్పుకోనున్నట్లు ఇరాన్ ప్రకటన
  • పార్లమెంటులో బిల్లు రూపకల్పన చేస్తున్నట్లు విదేశాంగ మంత్రి వెల్లడి
  • అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నుంచి కూడా వైదొలగే యోచన
ఇజ్రాయెల్‌తో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నట్లు టెహ్రాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగశాఖ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘై సోమవారం వెల్లడించారు. దీనికి సంబంధించి తమ దేశ పార్లమెంట్ ఒక బిల్లును సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు.

సామూహిక జనహనన ఆయుధాల తయారీని తమ దేశం మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని బాఘై స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎన్‌పీటీ నుంచి తప్పుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌పీటీ మాత్రమే కాకుండా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) సభ్యత్వం నుంచి కూడా వైదొలగే అంశాన్ని ఇరాన్ పరిశీలిస్తోంది.

ఇరాన్ అణు కార్యక్రమం 1950వ దశకంలో నాటి పాలకుడు షా రెజా పలావీ హయాంలో అమెరికా సహకారంతో ప్రారంభమైంది. అనంతరం 1958లో ఇరాన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థలో సభ్యత్వం పొందింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇరాన్ 1968లో సంతకం చేయగా 1970లో ఆ దేశ చట్టసభ దీనిని ఆమోదించింది. అదే ఏడాది ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం సంతకం చేసిన ఏ దేశం కూడా అణ్వాయుధాలను తయారు చేయడం, సమకూర్చుకోవడం లేదా బదిలీ చేయడం వంటివి చేయరాదు.

అయితే, ఇరాన్ పౌర అణు కార్యక్రమం ముసుగులో అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. మరోవైపు, ఇరాన్ అవసరానికి మించి యురేనియంను శుద్ధి చేస్తోందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కూడా గతంలో ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో, ఇరాన్ అణుబాంబు తయారీకి దగ్గరగా ఉందన్న అనుమానంతో ఇజ్రాయెల్ ఆ దేశంపై ముందస్తు దాడులకు దిగింది. ఇప్పటివరకు నతాంజ్‌తో పాటు పలు ఇరాన్ అణుకేంద్రాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసిందని, ఈ దాడుల్లో డజనుకు పైగా అణు శాస్త్రవేత్తలు మరణించారని సమాచారం.
Iran
Israel
Treaty on the Non-Proliferation of Nuclear Weapons

More Telugu News