Naseer Ahmed: మంత్రి నారా లోకేశ్ చొరవతోనే ఇది సాధ్యమైంది: గుంటూరు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్

Naseer Ahmed Praises Nara Lokesh for Talliki Vandanam Success
  • సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ మారుపేరన్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్
  • 'తల్లికి వందనం' పథకంతో ప్రతి ఇంట్లో సంతోషాలు వెల్లివిరిశాయి
  • ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆర్థిక సాయం
  • ఏడాదిలోనే రూ.10,091 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ
  • జగన్ రెడ్డి పాలనలో సంక్షేమం పేరుతో సంక్షోభమే మిగిలిందన్న ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి మారుపేరుగా నిలుస్తోందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటా పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. పాఠశాలలు తెరిచిన తొలిరోజే 4.81 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.718.95 కోట్లు జమ చేశామని, విద్యార్థులకు స్కూల్ కిట్లు, బ్యాగులు అందించామని తెలిపారు. మంత్రి నారా లోకేశ్ చొరవతో ఇది సాధ్యమైందని, ఇది ఒక రికార్డు అని కొనియాడారు.

గత వైసీపీ ప్రభుత్వం పిల్లలను చదివించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, ఈ పథకం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులందరినీ చదివించాలని ప్రోత్సహిస్తున్నారని నసీర్ అహ్మద్ వివరించారు. 'తల్లికి వందనం' పథకాన్ని వైసీపీకి మరణశాసనంగా ఆయన అభివర్ణించారు. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 'అమ్మఒడి' కింద రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తే, తమ కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 'తల్లికి వందనం' కోసం రూ.10,091 కోట్లు కేటాయించిందని వివరించారు. 

ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.13,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని, కొందరు ఐదుగురు పిల్లలున్న తల్లులకు రూ.65,000, ఒక కుటుంబంలో 12 మంది పిల్లలకు రూ.1,56,000 కూడా జమ చేశామని నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఒక్కరికే పరిమితం చేసి మోసం చేసిందని ఆరోపించారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా చంద్రబాబు 'పీ4' విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. ' గతంలో కేవలం 42 లక్షల మందికే 'అమ్మఒడి'అందిందని, తల్లికి వందనం' ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందని వివరించారు. మైనార్టీలకు కూడా కూటమి ప్రభుత్వంలో 54 శాతం అధికంగా ప్రయోజనం కలిగిందని తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం విధ్వంసం నుంచి నేడు అభివృద్ధి వైపు పయనిస్తోందని, సూపర్ సిక్స్ హామీల అమలుతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని నసీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు.
Naseer Ahmed
Nara Lokesh
TDP
Talliki Vandanam
Andhra Pradesh Education
Chandrababu Naidu
Guntur
AP Politics
School Kits
Jagan Reddy

More Telugu News