Revanth Reddy: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!

Revanth Reddy Govt to Deposit Rythu Bharosa Funds Soon
  • రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ
  • మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి
  • సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని మంత్రులకు సూచన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది. రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనుంది. ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా ముఖ్యమంత్రి చర్చించారు. జిల్లా నేతలతో ఇన్‌ఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.

వైద్య కళాశాలలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న 34 వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల రాష్ట్రంలోని 26 వైద్య కళాశాలల్లో ఉన్న సౌకర్యాలపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాష్ట్రంలోని పలు మెడికల్ కళాశాలల్లో సదుపాయాల కొరత ఉందని గుర్తించిన జాతీయ వైద్య మండలి, ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)లను ఈ నెల 18న ఢిల్లీకి రావాలని ఆదేశించింది. సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్ కూడా వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొనాలని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కళాశాలల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసి, నివేదిక సమర్పించడానికి అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.

ఆయా కళాశాలల్లో అవసరమైన అన్ని వసతులను రాబోయే మూడేళ్లలో సమకూర్చాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, అనుమతుల వివరాలను తనకు అందజేస్తే, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో మాట్లాడి వాటిని త్వరితగతిన మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ "నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ భాషను ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా నేర్పించాలి. జపాన్‌లో మన నర్సింగ్ సిబ్బందికి మంచి డిమాండ్ ఉంది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి" అని సూచించారు. వైద్య, విద్య శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రతి నెలా మూడో వారంలో తప్పనిసరిగా సమీక్షా సమావేశం నిర్వహించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
Revanth Reddy
Rythu Bharosa
Telangana government
Medical colleges
NMC

More Telugu News