Chandrababu Naidu: దేశంలో ఇలాంటి ప్రదేశం మరెక్కడా లేదు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Praises Visakhapatnam for Yoga Andhra Event
  • విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగాకు అద్భుత ప్రదేశం అని వెల్లడి
  • దేశంలోనే విశాఖ తీరం ప్రత్యేకమని ముఖ్యమంత్రి వ్యాఖ్య
  • 5 లక్షల మందితో యోగా.. గిన్నిస్ రికార్డు సాధనే లక్ష్యం
  • యోగాను ప్రజా ఉద్యమంగా మార్చాలని చంద్రబాబు పిలుపు
  • జూన్ 21న కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న 'యోగాంధ్ర' కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఉన్న సువిశాల తీర ప్రాంతం అత్యంత అనువైందని, దేశంలో మరెక్కడా ఇటువంటి ప్రదేశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సోమవారం విశాఖకు విచ్చేసిన ఆయన, ఆర్కే బీచ్ నుంచి రుషికొండ సమీపంలోని గీతం విశ్వవిద్యాలయం వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను కూడా తనిఖీ చేశారు.

ఈ పర్యటన అనంతరం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమ నిర్వహణకు చేపడుతున్న చర్యలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన సూచనలు, సలహాలను ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి స్వీకరించారు. ప్రపంచ రికార్డు నెలకొల్పేలా యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

యోగా డే డిక్లరేషన్ చేద్దాం 

సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, "అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒక డిక్లరేషన్ గా తీసుకుందాం. యోగాను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో అంతర్భాగంగా మార్చేందుకు కృషి చేద్దాం. విశాఖలో ఒక చారిత్రక ఘట్టానికి నాంది పలుకుతున్నాం, అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది ప్రజలు యోగా దినోత్సవంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం 5 లక్షల మందితో యోగా చేసేందుకు వేదిక కానుందని, ఈ కార్యక్రమంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. 

యోగా అందరి జీవితాల్లో భాగం కావాలి

యోగా దినోత్సవ నిర్వహణలో భాగంగా భారతీయ నౌకాదళం కూడా ఆర్కే బీచ్ సమీపంలో 11 నౌకలతో ప్రదర్శన ఏర్పాటు చేయనుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అధికారులకు సూచనలిస్తూ, "శిక్షణ పొందిన వారే యోగా దినోత్సవంలో పాల్గొంటారు. యోగాను ఒక ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలి. ప్రధాని మోదీకి ఇచ్చిన మాట ప్రకారం యోగా నిర్వహణకు ప్రణాళిక రూపొందించాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పనిసరి. అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం" అని పిలుపునిచ్చారు. 

607 వార్డు సచివాలయాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, 326 కంపార్ట్‌మెంట్లలో యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పార్కింగ్, మరుగుదొడ్ల వంటి సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాల్గొనేవారికి అవసరమైన అన్ని వివరాలను ముందుగానే తెలియజేయాలని, వారు కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళ్లేంత వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పసుపు నీళ్లలో చొక్కాలు ముంచి ఇచ్చాం!

సమీక్ష సందర్భంగా 1987లో జరిగిన మహానాడును ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సరైన వసతులు లేని రోజుల్లో కూడా కళా వెంకట్రావు వంటి నేతల సహకారంతో మహానాడును అద్భుతంగా నిర్వహించామని, ఎంతమంది వస్తారు, ఎంత దూరం నడుస్తారనేది కూడా ముందే అంచనా వేశామని తెలిపారు. హాజరయ్యేవారంతా పసుపు చొక్కాలు ధరించి రావాలని సూచించామని, అలా రానివారి చొక్కాలను పసుపు నీళ్లలో ముంచి ఇచ్చామని నాటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున ఇలాంటి కార్యక్రమాలను మరింత విజయవంతంగా నిర్వహించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Chandrababu Naidu
International Yoga Day
Visakhapatnam
Yoga Andhra
Narendra Modi
RK Beach
Andhra University
Yoga Declaration
Guinness World Records
Indian Navy

More Telugu News