MK Stalin: తమిళనాడు గవర్నర్ పై స్టాలిన్ ఫైర్

MK Stalin Fires on Tamil Nadu Governor RN Ravi
  • మరోసారి గవర్నర్ తీరుపై విమర్శలు గుప్పించిన తమిళనాడు సీఎం స్టాలిన్
  • సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా గవర్నర్ తీరు మార్చుకోలేదంటూ ఫైర్ 
  • కరుణానిధి పేరు మీద కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లును గవర్నర్ పెండింగ్‌లో పెట్టారని మండిపాటు
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో ఉంచడంపై తమిళనాడులో కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్న విషయం విదితమే.

సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినా గవర్నర్ తన వైఖరిని మార్చుకోలేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తంజావూరులో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరు మీద కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లును గవర్నర్ పెండింగ్‌లో ఉంచారని ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు.

నూతన విశ్వవిద్యాలయానికి కరుణానిధి పేరు పెట్టే అంశంపై తొలుత తాను సంకోచించానని, అయితే అనేక పార్టీలు కరుణానిధి పేరు పెట్టాలని పట్టుబట్టినందున అసెంబ్లీలో బిల్లును ఆమోదించి మే 2న గవర్నర్‌కు పంపడం జరిగిందని ఆయన అన్నారు. అయినప్పటికీ, ఇంతవరకు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు.

ఈ విషయంపై అనేకమార్లు సంప్రదించామని కూడా ఆయన పేర్కొన్నారు. గవర్నర్ చర్యపై రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ఆయన తీరు ఏ మాత్రం మారలేదని ముఖ్యమంత్రి స్టాలిన్ బహిరంగ సభలో విమర్శించారు.

తమిళనాడులో గవర్నర్ వద్ద బిల్లుల పెండింగ్ అంశంపై డీఎంకే ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గవర్నర్ చర్యలను తప్పుబడుతూ కీలక ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే. 
MK Stalin
Tamil Nadu
Governor RN Ravi
Tamil Nadu Assembly
Karunanidhi
Supreme Court
Bill pending
DMK
Tanjavur
University bill

More Telugu News