Maharashtra: హృద‌య‌విదార‌క ఘ‌ట‌న‌.. ప్లాస్టిక్ సంచిలో మృతశిశువు.. బ‌స్సులో 90 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం!

Maharashtra Family Carries Stillborn Baby In Plastic Bag After Failing to Get Ambulance
  • మహారాష్ట్ర పాల్ఘర్‌ జిల్లాలో ఘటన
  • అంబులెన్స్ సమయానికి రాక గర్భంలోనే శిశువు మృతి
  • శిశువు మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో తరలించిన వైనం
  • 90 కిలోమీటర్లు ప్రయాణించిన నిస్సహాయ కుటుంబం
  • ఆరోగ్య వ్యవస్థ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వైద్య సేవల లోపం ఓ పసికందు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, ఆ శిశువు మృతదేహాన్ని ఓ నిరుపేద కుటుంబం ప్లాస్టిక్ సంచిలో 90 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాల్సిన అత్యంత దయనీయ పరిస్థితి దాపురించింది. ఈ హృదయ విదారక ఘటన మోఖాడ తాలూకాలో చోటుచేసుకుంది. ఈ నెల 11న జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

మోఖాడకు చెందిన గర్భిణి అవిత‌ సఖారాం కవర్‌కు ఈ నెల 11న‌ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే 108 అత్యవసర అంబులెన్స్ సేవలకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ, మధ్యాహ్నం వరకు ఎటువంటి అంబులెన్స్ అందుబాటులోకి రాలేదు. చేసేదేమీలేక వారు సొంతంగా ఓ ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకుని ఆమెను ఖొడాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

అయితే, అక్కడ కూడా సరైన చికిత్స అందడంలో ఆలస్యం జరగడంతో పరిస్థితి విషమించిందని భావించిన వైద్యులు ఆమెను నాసిక్‌లోని ఓ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దురదృష్టవశాత్తూ నాసిక్ ఆసుపత్రికి చేరుకోకముందే గర్భంలోనే శిశువు మృతి చెందింది. అక్క‌డ అవిత‌ మృత శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. తిరిగి వచ్చేటప్పుడు మృత శిశువును తరలించేందుకు కూడా ఆసుపత్రి యాజమాన్యం అంబులెన్స్ సమకూర్చలేదు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో మరణించిన తమ పసికందును ఓ ప్లాస్టిక్ సంచిలో వేసుకుని సుమారు 90 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. ఈ దుస్థితి పాల్ఘర్‌లోని జవహర్-మోఖాడ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ ఎంత దయనీయంగా ఉందో మరోసారి బహిర్గతం చేసింది.

మరోవైపు పాల్ఘర్ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయంపై స్పందిస్తూ, గర్భిణి ఆరోగ్యంపై తాము పర్యవేక్షణ జరుపుతున్నామని, గర్భంలోనే శిశువు మరణించిన విషయం తమకు తెలుసునని తెలిపారు. అయితే, మృత శిశువును కుటుంబ సభ్యులు ప్లాస్టిక్ సంచిలో తరలించారన్న విషయం తమ దృష్టికి రాలేదని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని అధికారులు వెల్లడించారు. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 
Maharashtra
Palghar district
healthcare crisis
infant death
ambulance service
Avita Sakharam Kawar
Khodala Primary Health Center
Nashik hospital
medical negligence
government investigation

More Telugu News