KBR Park: హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ కోసం కొత్త టెక్నాలజీ

KBR Park Hyderabad Gets New Parking Technology
  • కేబీఆర్ పార్క్ వద్ద నూతన టెక్నాలజీతో మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయం
  • ఒకేసారి 72 కార్లు నిలుపుదల చేసే అవకాశం 
  • పది రోజుల ట్రయల్ రన్ తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి
హైదరాబాద్‌లో వాహనాల పార్కింగ్ సమస్య తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో వాహనాల పార్కింగ్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా కేబీఆర్ పార్క్ వద్ద 400 గజాల స్థలంలో మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకేసారి 72 కార్లను నిలపవచ్చునని నిర్వహకులు తెలిపారు.

కేబీఆర్ పార్క్ వద్ద నిత్యం ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పార్క్‌కు వచ్చే వాకర్లు కార్లు నిలుపుదల చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ ట్రయల్ రన్‌లో ఉంది. పది రోజుల తర్వాత పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కొరియన్ టెక్నాలజీ ద్వారా దీనిని నిర్మించారు. ఇందుకోసం రూ.6 కోట్ల రూపాయలు వెచ్చించారు. దీని ద్వారా బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పార్కింగ్, ట్రాఫిక్ జామ్ సమస్యలు కొంతమేర తగ్గుతాయని భావిస్తున్నారు.

కేబీఆర్ పార్కింగ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ విజయవంతం అయితే నగరంలోని మిగతా రద్దీ ప్రదేశాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇటువంటి మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయాలను ఎక్కువ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే నగరంలో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
KBR Park
Hyderabad
KBR Park Parking
Multi Level Parking
Traffic Problem
Parking Technology
Banjara Hills
Jubilee Hills
Hyderabad Traffic
Korean Technology

More Telugu News