Jogi Ramesh: చంద్రబాబు ఇంటినే కాదు... అవసరమైతే అసెంబ్లీనే ముట్టడిస్తా: జోగి రమేశ్

Jogi Ramesh Warns to Siege Chandrababus House and Assembly
  • చంద్రబాబు హామీలు నెరవేర్చకపోతే ఇంటిని, అసెంబ్లీని ముట్టడిస్తానన్న జోగి రమేశ్
  • ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని వ్యాఖ్య
  • సూపర్ సిక్స్ హామీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్న మాజీ మంత్రి
ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చకపోతే, ఆయన ఇంటినే కాదు అవసరమైతే శాసనసభను కూడా ముట్టడిస్తానని వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. ప్రజా పక్షాన నిలబడి పోరాడతామని, ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన "సూపర్ సిక్స్" హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీపై జోగి రమేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ అక్కడ విజయం సాధించిందని విమర్శించారు. "సీల్డ్ కవర్‌లో ఏముందో వారం రోజులుగా ఎందుకు తెరవలేదు? కొండపల్లి మున్సిపాలిటీ నుంచే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందో, వ్యతిరేకత ఉందో తేలిపోతుంది. దమ్ముంటే మళ్లీ అక్కడ ఎన్నికలు నిర్వహించండి, ప్రజలు మీకు ఓట్లు వేస్తారో లేదో తెలుస్తుంది" అని సవాల్ విసిరారు.

అనంతరం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై కూడా జోగి రమేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "వసంత కృష్ణప్రసాద్ ఓ బుడంకాయ్. నందిగామలో ఎందుకు ఓడిపోయాడో చెప్పాలి. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది వైసీపీ, జగన్మోహన్ రెడ్డి కాదా?" అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతామని జోగి రమేశ్ ఈ సందర్భంగా తెలిపారు.
Jogi Ramesh
Chandrababu Naidu
YSRCP
Telugu Desam Party
Andhra Pradesh Assembly
Kondapalli Municipality Elections
Vasanta Krishna Prasad
Super Six Promises
Political Protest
Andhra Pradesh Politics

More Telugu News